తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli). ఈ రోజు తెలుగు పాట ఆస్కార్ గడప తొక్కిందంటే... నూటికి నూరు పాళ్ళు ఆయన విజన్ కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక్క రాజమౌళి మాత్రమే కాదు... ఆయన కుటుంబం అంతా చిత్ర పరిశ్రమలో ఉంది.
ప్రస్తుతం కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ అండ దండలు రాజమౌళి ఫ్యామిలీకి పుష్కలంగా ఉన్నాయనేది పరిశ్రమలో వినిపిస్తున్న గుసగుస. అందుకు పద్మ పురస్కారాలను, రాజ్యసభ సీటును ఉదాహరణగా చూపిస్తున్నారు.
రాజమౌళికి పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది?
కీరవాణిని తాజాగా పద్మ పురస్కారం వరించింది. ఆయన కంటే ఏడేళ్ళ ముందు రాజమౌళి పద్మశ్రీ అందుకున్నారు. జక్కన్నను 2016లోనే దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ వచ్చింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే.
ఇప్పుడు కీరవాణికి పద్మశ్రీ వచ్చింది. ఇప్పుడూ కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఈ రెండూ మాత్రమే కాదు... ఓ రాజ్యసభ సీటు కూడా ఉంది.
రాజమౌళి తండ్రిని రాజ్యసభకు పంపిన బీజేపీ
ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు. ఆయన్ను రాష్ట్రపతి కోటాలో గత ఏడాది నామినేట్ చేశారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు ఇళయ రాజాను కూడా నామినేట్ చేశారు. తాను రాసిన కథలే తనను రాజ్యసభకు తీసుకు వెళ్ళాయని వి. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ ఎంపికపై విమర్శలు చేసిన వారు కొందరు ఉన్నారు. అయితే, ఇక్కడ ఆయన ప్రతిభను తక్కువ చేయలేం. భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో భారీ విజయం సాధించిన సినిమాకు కథ అందించినది ఆయనే. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది రాజమౌళి అయితే, సంగీత బాధ్యతలు చూసుకున్నది కీరవాణి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ జెండా ఎగరేస్తున్న 'ఆర్ఆర్ఆర్' వెనుక కూడా ఈ ముగ్గురూ ఉన్నారు.
రాజమౌళి ఫ్యామిలీ కుటుంబాన్ని, వాళ్ళ ప్రతిభను తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు గానీ... వాళ్ళ ప్రతిభకు తగ్గ గౌరవ మర్యాదలను బీజేపీ పెద్దలు చేస్తున్నారనేది మాత్రం వాస్తవమని కొందరు చెబుతున్నారు. ఆ మాటలను విస్మరించలేం. రేపు రాజమౌళికి మరో పద్మ పురస్కారం వరించినా ఆశ్చర్యం లేదు. అందుకు ఆయన అర్హులే. ఎటు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో మరి కొందరు ప్రతిభావంతులకు మాత్రం అన్యాయం జరిగిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పద్మ అవార్డుల్లో మరోసారి తెలుగు చిత్రసీమకు అన్యాయం - కైకాల, జయసుధ ఎక్కడ?
కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే, ఇప్పుడు అందరి కళ్ళు ఆస్కార్ మీద ఉన్నాయి. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు...'కు నామినేషన్ లభించడంతో మార్చి 23వ తేదీ విజేతల వివరాలు వెల్లడించే వరకు వెయిట్ చేయక తప్పదు. అయితే, కీరవాణి కెరీర్ ముగిసినట్టేనని కొందరు కామెంట్స్ చేస్తున్న సమయంలో గోల్డెన్ గ్లోబ్, ఫారిన్ క్రిటిక్స్ నుంచి అవార్డులు, ఇప్పుడీ పద్మశ్రీ ఆయన ఘనతను మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పాయి.
Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?