గణతంత్ర దినోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. 21 - గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు.


రాజధానిలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర పరేడ్‌ కూడా బాగా జరిగింది. సైనిక శక్తి సామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రాంతాలకు తగ్గట్లుగా సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రబల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ముందు ఎద్దుల బండి, వెనుక సంక్రాంతి పండుగను చాటేలా అలంకరించారు. అలాగే గుజరాత్‌, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.


ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం అయింది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ప్రధాని మోదీ గణతంత్ర వేడుకల వద్దకు వచ్చారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరయ్యారు. సైనిక పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంది.