Varuna Drone In Republic Day Parade: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం సరికొత్తగా కనిపించనుంది. చాలా అంశాల్లో భారత్ స్వదేశీ శక్తిని చాటేలా ఈసారి కార్యక్రమాలు రూపొందించారు. నేటి పరేడ్ నిజంగా చాలా స్పెషల్ గా ఉండబోతోంది. ప్రతి సంవత్సరం పరేడ్‌లో ఏదో ఒక కొత్తదనం ఉన్నప్పటికీ... ఈసారి ఓ వ్యక్తిని ఎత్తుకెళ్లే డ్రోన్‌ ఈసారి అందర్నీ ఆశ్చర్యపరచబోతోంది. ఈ డ్రోన్ పేరు 'వరుణ్'. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ డ్రోన్ ప్రయోగం జరిగింది.


'వరుణ్' డ్రోన్‌ను మహారాష్ట్రకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ పేలోడ్ కెపాసిటీ 130 కిలోలు. ఒక వ్యక్తిని మోసుకెళ్లే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉంది. ఇది 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఒకసారి ప్రయాణం స్టార్ట్ చేస్తే 25 నుంచి 33 నిమిషాల పాటు గాల్లో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో నేవీలో కూడా దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.


మనుషులతోపాటు ఆయుధాలను మోసుకెళ్లగలదు.


వరుణ్ డ్రోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది మనుషులతో పాటు ఆయుధాలను కూడా తీసుకెళ్లగలదు. అదే సమయంలో సైన్యానికి ఆహారం,నీళ్లు పంపాల్సి వస్తే పంపవచ్చు. 'మేకిన్ ఇండియా'కు వరుణ్ డ్రోన్‌ గొప్ప ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ రిపబ్లిక్ పరేడ్‌లో వరుణ్‌ను చేర్చడం గర్వకారణమని, నావికాదళం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాల్లో ఒకటిగా ఐడెక్స్ స్ప్రింట్ ఛాలెంజ్‌ను ప్రస్తావించడం గర్వకారణమన్నారు.




యుద్ధభూమిలో ఫ్రంట్‌లైన్‌ దళాలను రక్షించడానికి, జాతీయ నిఘా, భద్రతను మెరుగుపరచడానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మించడమే వరుణ్‌ డ్రోన్ యొక్క ప్రధాన లక్ష్యం అని పరాశర్ చెప్పారు.


వరుణ్ డ్రోన్ ను ఇష్టపడిన ప్రధాని మోదీ


స్వావలంబన భారత్ దిశగా వరుణ్ డ్రోన్ తొలి అడుగు. గత ఏడాది జూలై 18న ఢిల్లీలో దీని ప్రయోగం జరిగింది. ఈ ట్రయల్ రన్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ డ్రోన్ పనితీరును ప్రశంసించారు. ట్రయల్ సమయంలో డ్రోన్ వరుణ్ సుమారు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి ల్యాండింగ్ కు ముందు గాల్లో అటూ ఇటూ ఎగిరింది. ప్రధానిని ఈ డ్రోన్ ఎంతగానో ఆకట్టుకుంది.


5 శక్తివంతమైన ఆయుధాల బలం 


భారత స్వశక్తిని పుంజుకుంటోంది. అత్యుత్తమమైన ఐదు ఆయుధాలను ప్రస్తుతం కలిగి ఉంది. వీటిని చూడగానే శత్రువులు వణికిపోతారు. ఇందులో స్వదేశీ 'నాగ్' క్షిపణి ఒకటి. స్వదేశీ 'నాగ్' క్షిపణి గంటకు గరిష్టంగా 828 కిలోమీటర్ల వేగంతో ప్రయోగించగలదు. నాగ్ క్షిపణిలో 500 మీటర్ల నుంచి 20 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. 
పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (ఎంబీఆర్ఎల్) వ్యవస్థ కేవలం 44 సెకన్లలో 12 రాకెట్లను ప్రయోగించగలదు. 
అర్జున్‌ ఎంకే౧- దీనికి 120 ఎంఎం ఫిరంగి ఉంది. 'అర్జున్' ఎంకే1 ట్యాంకు పరిధి 450 కిలోమీటర్లు.
తేజస్ యుద్ధ విమానం- 52 వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు. ఇది గరిష్టంగా 4 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది గంటకు 2,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.
ధనుష్ - ఇది దేశంలోనే అతి పొడవైన శ్రేణి ఆర్టిలరీ గన్. 13 టన్నుల బరువున్న ఈ హోవిట్జర్ గన్ ను ఏ వాతావరణంలోనైనా ప్రయోగించవచ్చు.