సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani)ని కేంద్ర ప్రభుత్వం మన దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇది సంతోషకరమైన విషయం. ఈ ఏడాది పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన పురస్కారం ఇది మాత్రమే. ఈ ఒక్క అవార్డుతో చిత్రసీమ సంతృప్తిగా లేదు. ఇప్పటికిప్పుడు ఎవరూ పైకి చెప్పకున్నా, పద్మ పురస్కారాల్లో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమకు అన్యాయం జరిగిందనే భావన ఇటు పరిశ్రమలో, అటు ప్రేక్షకుల్లో నెలకొంది. అందుకు కారణం కొందరికి పద్మ పురస్కారాలు రాకపోవడమే.


కైకాలకు పద్మ పురస్కారం ఎక్కడ?
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆ మాటకు వస్తే భారతీయ చిత్ర పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఆయన పేరు ఉంటుంది. తెలుగు తెరకు యముడు అంటే ఆయనే. గత ఏడాది డిసెంబర్ 22న ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. బతికి ఉన్న రోజుల్లో పద్మ పురస్కారం రాకపోవడంపై ఒకట్రెండు సందర్భాల్లో కైకాల మాట్లాడారు. ఆయన మరణించిన తర్వాత అయినా సరే ప్రభుత్వాలు పద్మ పురస్కారం ఇస్తాయేమోనని అభిమానులు కొందరు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డుల్లో కైకాల పేరు లేకపోవడంతో వాళ్ళ మనసు నొచ్చుకుంది.


కైకాల ముందు తరంలో మహా నటుడు ఎస్వీ రంగారావుకు సైతం పద్మ అవార్డు రాలేదు. ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవాల్లో (జకార్తా 1963) ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది కానీ పద్మ పురస్కారం ఆయన్ను వరించలేదు. 


కంగనా... రవీనా... పద్మశ్రీలు!
లిస్టులో జయసుధ పేరు లేదు!
''కంగనా రనౌత్‌కు పద్మశ్రీ ఇచ్చారు. నాకు ఎందుకు ఇవ్వలేదో తెలియదు'' అని ఆ మధ్య బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో సహజ నటి జయసుధ వ్యాఖ్యానించారు. ఆమెతో పాటు ఆ షోకు వచ్చిన మరో సీనియర్ హీరోయిన్, రాజకీయాల్లోనూ రాణించిన జయప్రదకు కూడా పద్మ పురస్కారం రాలేదు. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కూడా పద్మ అవార్డు రాకపోవడం పట్ల జయసుధ విస్మయం వ్యక్తం చేశారు. పరోక్షంగా చురకలు వేశారు. చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల అనుభవం జయసుధ సొంతం. అయినా ఆమెను పద్మ పురస్కారాలకు గుర్తించలేదు. 


ఈ ఏడాది రవీనా టాండన్ పద్మ శ్రీకి ఎంపిక అయ్యారు. అయితే, ఆ లిస్టులో జయసుధ పేరు లేదు. తొలి తరం కథానాయిక జమునకు కూడా ఇంకా పద్మ అవార్డు రాలేదు. జాబితా చెబుతూ వెళితే... పద్మ అవార్డుకు నోచుకోని మహా నటులు, నటీమణులు, ప్రముఖులు చిత్రసీమలో చాలా మంది కనపడతారు.


Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యువ హీరోకి ఛాన్స్ - సిరీస్ నుంచి సినిమాకు  


పద్మ పురస్కారాలకు ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాల్సి ఉంటుంది. రాజమౌళికి కర్ణాటక కోటాలో పద్మ శ్రీ వచ్చింది. తెలుగు పరిశ్రమలో కొందరు ప్రముఖుల పేర్లను ఇరుగు పొరుగు రాష్ట్రాలు సూచించాయి. ఒకవేళ తెలుగు రాష్ట్రాలు చిత్రసీమ ప్రముఖుల పేర్లను పంపించడం లేదా? లేదంటే కేంద్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయా? ఎప్పటికీ సమాధానం లభించని ప్రశ్నలే. ఏది ఏమైనా మరోసారి తెలుగు చిత్రసీమకు పద్మ అవార్డుల్లో అన్యాయం జరిగిందనే భావన చాలా మందిలో బలంగా ఉంది. 


రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కాదు... ప్రజలు కూడా పద్మ పురస్కారాలకు ప్రముఖులను నామినేట్ చేయవచ్చు. వాళ్ళ ఘనతలను చెబుతూ ఎందుకు పురస్కారానికి అర్హులో విమరించవచ్చు. ఎక్కువ ఓట్లు వస్తే ఆ ప్రముఖుల పేర్లను పరిగణలోకి తీసుకుంటారు. దాని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ ఉంది. దీనిపై ప్రేక్షకుల్లో అవగాహన లేకపోవడమూ తెలుగు చిత్రసీమ ప్రముఖులకు అవార్డులు రాకపోవడానికి ఓ కారణమైంది. 


Also Read : 'పఠాన్' రివ్యూ : కింగ్ ఖాన్ షారుఖ్ ఈజ్ బ్యాక్! మరి, సినిమా ఎలా ఉంది?