Bigg Boss Tamil: బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్.. విన్నర్ అయ్యింది. మామూలుగా ప్రతీసారి తెలుగు, తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఒకేసారి స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం తెలుగు సీజన్ కాస్త ముందుకు ప్రారంభమయ్యింది. అందుకే ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. ఇక తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 తమిళంలో వీజే అర్చన టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బిగ్ బాస్ సీజన్ 7 తమిళంలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది అర్చన రవిచంద్రన్. టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచిన మణిచంద్రన్, మాయా కృష్ణన్, దినేష్ గోపాలస్వామి, విష్ణు విజయ్‌ను వెనక్కి నెట్టి అర్చన విన్నర్ అవ్వడంతో తన ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు.


ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ..
బిగ్ బాస్ సీజన్ 7 తమిళం ఫైనల్ సీజన్.. ఆదివారం ప్రసారమయ్యింది. అందులో అర్చనను విన్నర్‌గా ప్రకటిస్తూ కమల్ హాసన్.. తన చేతిని పైకి ఎత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రోఫీతో పాటు విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కనుంది. అర్చన.. బిగ్ బాస్ సీజన్ 7 తమిళం విన్నర్ అవ్వగా రన్నర్ స్థానంలో మణిచంద్రన్ నిలిచాడు. సెకండ్ రన్నరప్‌ స్థానాన్ని మాయ దక్కించుకుంది. నాలుగో స్థానంలో దినేశ్, అయిదో స్థానంలో విష్ణు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 తమిళం ప్రారంభమయిన 28 రోజుల తర్వాత అర్చన రవిచంద్రన్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇతర వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లాగానే తను కూడా ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అని, విన్నర్ అవ్వడం కష్టమని ప్రేక్షకులు మొదట్లో అనుకున్నారు.


తిరగబడింది..
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వడంతో ముందు నుంచి హౌజ్‌లో ఉన్న మాయ, పూర్ణిమలాంటి కంటెస్టెంట్స్ అర్చనను అనవసరంగా ఆటపట్టించడం మొదలుపెట్టారు. కొన్నిరోజులు సైలెంట్‌గా చూసి ఊరుకున్నా.. అర్చనను కూడా వారిపై రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ సమయంలో తనకు తోడుగా ఎవరూ నిలబడకపోయినా.. ఒంటరిగా అందరినీ ఎదిరించింది. అలా కొన్నిరోజులకే ఇతర కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఫైనల్‌గా తన కష్టం ఫలించింది. తన ప్రవర్తనతో చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకొని, వారి ఓట్లతో విన్నర్‌గా నిలిచింది.


23 కంటెస్టెంట్స్‌తో..
మొత్తం 23 కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ తమిళం సీజన్ 7 ప్రారంభమయ్యింది. అక్షయ్, ఐశు, కూల్ సురేశ్, జోవికా విజయ్‌కుమార్, మణిచంద్రన్, మాయా కృష్ణన్, నిక్సెన్, పూర్ణిమ రవి, ప్రదీప్ ఆంటోనీ, రవీన్ దాహ, శరవణ విక్రమ, విచిత్రా విలియమ్స్, విజయ్ వర్మ, వినుషా దేవీ, విష్ణు విజయ్, యుగేంద్రన్ వాసుదేవన్, బావా చెల్లుదురయ్, అనన్య రావు కంటెస్టెంట్స్‌గా ఈ సీజన్ మొదలయ్యింది. ఆ తర్వాత కొన్నిరోజులకు దినేష్ గోపాలస్వామి, అన్న భారతీ, అర్చన, ఆర్జే బ్రావో, గణ బాలా బిగ్ బాస్ సీజన్ 7 తమిళంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. వీజే అర్చన విన్నర్‌గా నిలిచినందుకు తన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: ‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్ - మారుతి సినిమా ఫస్ట్‌లుక్!