The Raja Saab: ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌లో కూడా ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్‌కు కొత్తగా ఉంటుందని భావించగా... మరికొందరు ఈ సమయంలో ఈ సినిమా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమా సైలెంట్‌గా సెట్స్ మీదకు కూడా వెళ్లిపోయింది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.
ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ స్క్రీన్‌పై తన కామెడీ చూసి చాలా కాలం అయిపోయింది. ‘బాహుబలి సిరీస్’ తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మధ్యలో ‘రాధే శ్యామ్’ చేసినా అది లవ్ స్టోరీ కాబట్టి తన కామెడీ కనిపించలేదు. మారుతి సినిమాలు అంటేనే కామెడీకి పెట్టింది పేరు కాబట్టి ‘ది రాజా సాబ్’లో వింటేజ్ ప్రభాస్ మార్కు కామెడీ టైమింగ్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ గత చిత్రాల్లా పవర్‌ఫుల్‌గా కాకుండా బాగా కూల్‌గా, కొత్తగా, కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ సినిమా ఒక హార్రర్ కామెడీగా తెరకెక్కనుందని ప్రభాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
టీ షర్ట్, పూల లుంగీతో పోస్టర్‌లో ప్రభాస్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా ఉన్నారు. ప్రభాస్ హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే కొత్తగా ఉంది. మారుతి తన సినిమాల్లో హీరోల లుక్స్‌పై చాలా కేర్ తీసుకుంటారు. అది ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
‘ది రాజా సాబ్’లో నటిస్తున్న మిగతా కాస్ట్ గురించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మాళవిక కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తాత లేదా విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారని తెలుస్తోంది.
అయితే సాంకేతిక నిపుణుల పేర్లు మాత్రం పోస్టర్‌లో వచ్చేశాయి. అగ్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ‘ది రాజా సాబ్’కు మ్యూజిక్ అందిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ‘ది రాజా సాబ్’ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సంవత్సరమే విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.