Sivaji about Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన శివాజీ.. తన గేమ్‌పై కంటే పల్లవి ప్రశాంత్, యావర్‌ల గేమ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేశాడని చాలామంది ప్రేక్షకులు విమర్శించారు. ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి కూడా తనే కారణమని మాట్లాడుకుంటున్నారు. ఇక కొందరు శివాజీ ఫ్యాన్స్ మాత్రం ట్రోఫీ తనకు రావాల్సింది అని, కావాలనే త్యాగం చేశాడని భావిస్తున్నారు. వీటన్నింటిపై శివాజీ.. తాజాగా స్పందించాడు. అంతే కాకుండా హౌజ్‌లో తనకు నచ్చిన కంటెస్టెంట్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.


నేనేం త్యాగమూర్తిని కాదు..
‘‘నేనేం త్యాగమూర్తిని కాదు. నేను త్యాగం చేస్తే వాడికి వచ్చిందంటే వాడేం కష్టం చేయనట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఈ గేమ్ షోలో ప్రజల నిర్ణయం బట్టి పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వచ్చాడు. ఇంతే మాట్లాడుకోవాలి దాని గురించి. మధ్యలో ఎవరైనా ప్రభావితం చేశారా, ఏమైనా జరిగిందా అనేది ముఖ్యం కాదు. ఎవరి గేమ్ వాళ్లు ఆడారు. నేను కేవలం మోటివేషన్‌లాగానే ఉన్నాను. ఎప్పుడైనా నా గెలుపు కోసం నేను ఆడతాను.. పక్కవాళ్లు ఓడిపోవాలని కాదు. ప్రశాంత్, యావర్‌ను పట్టించుకోను. అందరిలాగానే ఒక్కడినే పోయి, ఒక్కడినే గేమ్ ఆడుకుంటా. ఎవడు ఎలా పోతే నాకెందుకు? అనే సిస్టమ్ నా దగ్గర లేదు. నిజంగానే ఒకడు ఆడుతున్నాడంటే వాడిని ఎంకరేజ్ చేస్తే ఏం పోతుంది?’’ అంటూ పల్లవి ప్రశాంత్‌కు తను చేసిన సపోర్ట్ గురించి చెప్పుకొచ్చాడు శివాజీ.


ఇదే నా అసలు రంగు..
ఇక బిగ్ బాస్ సీజన్ 7లో మొదటిరోజే మొక్క పట్టుకొని వచ్చిన ప్రశాంత్‌ను చూసి ‘‘వెళ్లేటప్పుడు మొక్కతో పాటు ప్రైజ్ కూడా తీసుకెళ్తాడు’’ అని అన్నాడు శివాజీ. ఆ మాటను గుర్తుచేసుకుంటూ ప్రకృతి తనతో ఆ మాట అనిపించిందని చెప్పాడు. ‘‘ఈ క్యారెక్టర్ కొత్తగా క్రియేట్ అయ్యింది కాదు. నేను ముందు నుండి అంతే. టైమ్ వచ్చింది. నా అసలు రంగు జనం చూశారు. వాళ్లకి నచ్చింది’’ అంటూ హౌజ్‌లో తను ఉన్న విధానం గురించి మాట్లాడాడు శివాజీ. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో తన చేతికి అయిన గాయం గురించి మాట్లాడుతూ ఇంకా ఇబ్బంది ఉందని, ఫిజియోకు వెళ్తున్నా అని చెప్పాడు. తనకు నచ్చని కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘పేర్లు అనవసరం. నచ్చకపోతే అక్కడే క్లారిటీగా చూపించాను. మనుషులు నచ్చకపోవడం కాదు.. ఆడే విధానం బాలేదు అని నా ఉద్దేశ్యం’’ అని తెలిపాడు.


పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై స్పందన..
‘‘స్పా బ్యాచ్ నచ్చకపోవడం అని ఏం లేదు. వాళ్లు ఆడే పద్ధతి కరెక్ట్ కాదు. వాళ్లు కూడా ఆర్టిస్టులే. మనలాగే ముందుకు వెళ్తున్నారు’’ అంటూ ‘స్పా’ బ్యాచ్‌పై స్పందించాడు శివాజీ. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదైనా అతిగా వెళ్లొద్దు. వాడి ఫ్యూచర్‌కు ఇది స్పీడ్ బ్రేకర్ ఏమో. నేను చూసిన ప్రశాంత్ అలాంటోడు కాదు. అలా అని ప్రశాంత్‌ను రోజూ భూతద్దంలో పెట్టి నేను చూడలేను. నాకొక జీవితం ఉంది. వాడికొక జీవితం ఉంది. శివాజీ కోర్టు దగ్గరకు వెళ్లలేదు, కలవలేదు అని రాశారు. నన్నేమైనా ఉద్యోగంలో పెట్టుకున్నాడా వాడు. తెలియనితనంతో, తనను చూడడానికి అంతమంది జనాలు వచ్చినప్పుడు మాటలు అటు, ఇటు జారుండొచ్చు. నేచర్ చిన్న వార్నింగ్ ఇచ్చింది’’ అని పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడాడు శివాజీ.


Also Read: ప్రజలదే తప్పు, మీకే సిగ్గు లేదు, పనికిమాలినోళ్లారా - శివాజీ సీరియస్