Kerala High Court Issues Notices To Bigg Boss Malayalam Makers: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోపై విమర్శలు సహజమే. ఇండియాలో ఈ షోను ఆపేయాలని ఇప్పటికే చాలామంది డిమాండ్ చేశారు. తెలుగు ‘బిగ్ బాస్’ను కూడా ఆపేయాలని పలువురు కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మలయాళంలో ‘బిగ్ బాస్‌’ షోకు ఊహించని షాక్ తగిలింది. ఈ రియాలిటీ షోను ఆపేయడానికి ఏకంగా కేరళ హైకోర్టు రంగంలోకి దిగింది. ఏకంగా బిగ్ బాస్ రియాలిటీ షోపై యాక్షన్ తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇది విన్న బిగ్ బాస్ లవర్స్.. షో మధ్యలో ఆగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు.


కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం..


జస్టిస్ ఏ ముహమ్మద ముస్తాక్, ఎమ్ ఏ అబ్దుల్ హఖీమ్‌తో ఏర్పడిన కేరళ హై కోర్టు బెంచ్.. బిగ్ బాస్ మలయాళం షోలో ప్రసారం అవుతున్న హింసాత్మక సన్నివేశాలపై  చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వైలెంట్ సీన్స్‌పై దృష్టిపెట్టమని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రోడ్కాస్టింగ్ శాఖకు సూచనలు ఇచ్చింది. ఇలాంటి షోలను పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని కేరళ హై కోర్టు సలహా ఇచ్చింది. అంతే కాకుండా బిగ్ బాస్ మలయాళం షోలో భాగమయిన ముఖ్య సంస్థలకు, వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే బిగ్ బాస్ మలయాళం షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మోహన్ లాల్‌కు నోటీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. 


ఆదేశాలను ఉల్లంఘించింది..


మోహన్ లాల్‌తో పాటు ప్రొడక్షన్ కంపెనీ ఎండెమోల్ షైన్ ఇండియాకు, బిగ్ బాస్ మలయాళంను టెలికాస్ట్ చేస్తున్న ఏషియానెట్, డిస్నీ స్టార్ సంస్థలకు కూడా కేరళ హై కోర్టు నోటీసులు పంపింది. ఇక బిగ్ బాస్ మలయాళంలో ఒక కంటెస్టెంట్ అయిన హసీబ్ ఎస్‌కే అలియాస్ ఏఎస్సై రాకీకి కూడా నోటీసులు వెళ్లాయి. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో రాకీ.. తన తోటి కంటెస్టెంట్‌పై దాడి చేశాడు. దాని వల్ల బిగ్ బాస్ వైలెంట్‌గా మారుతుందని గమనించిన కేరళ హై కోర్టు.. స్వయంగా రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా బిగ్ బాస్ సీజన్ 6 మలయాళంపై యాక్షన్ తీసుకోవాలని హై కోర్టు లాయర్ అయిన అడ్వొకేట్ ఆదర్శ్ తెలిపారు.


మే వరకు సమయం..


రాకీ.. తన తోటి కంటెస్టెంట్ అయిన సిజో జాన్‌పై చేయి చేసుకోవడం వల్ల బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఆ సంఘటన మాత్రం 1995 కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించేలా ఉందని అడ్వొకేట్ ఆదర్శ్ అన్నారు. ఇక మోహన్ లాల్ కూడా పరిస్థితిని మరింత వైలెంట్‌గా మార్చే విధంగా కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతున్నారని ఆరోపణలు వినిపించారు. మే 20న కేసు తరువాతి హియరింగ్‌కు సిద్ధమయ్యింది. ఇక ఈ వైలెంట్ సీన్స్‌పై ఒక రివ్యూ జరిగిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 మలయాళం ప్రసారం అవుతుందా లేదా ఆగిపోతుందా అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి చాలామంది మలయాళం బిగ్ బాస్ లవర్స్.. షోలో జరుగుతున్న గొడవలను ఎంజాయ్ చేస్తున్నారు.



Also Read: త్వరలో ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్' - ప్లాన్ మార్చిన దిల్ రాజు, ఈ నెలాఖరులోనే?