హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లు అనే మూవీ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. అదే తరహాలో ‘బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్స్ సందర్భంగా ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ కొట్టుకున్నది హీరో, విలన్ కాదు. కమెడియన్, విలన్ కొట్టుకుని ‘హీరో’ను చంపేసినట్లు.. అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? సింగర్ భోలే షావలి. చాలా సందర్భాల్లో భోలే.. తాను బయటకు వెళ్లాక హీరోనైతే.. అశ్వినీ శ్రీని హీరోయిన్ చేస్తాను అనడమే కాదు. ఛాన్సు దొరికినప్పుడల్లా ఆమెను తన సరదా మాటలతో ఆకట్టుకుంటున్నాడు. కవితలు చెబుతున్నాడు. మరి, అలాంటి అశ్వినీ.. తేజాతో గొడవ పడుతూ.. పదే పదే వయస్సులో పెద్దవాడు అనేసరికి భోలే తట్టుకోలేకపోయారు. చివరికి తాను ‘హీరో’ అని చెప్పి.. అశ్వినీని కూల్ చేసి గొడవ ఆపారు. ‘‘మీరిద్దరు కొట్టుకుంటే కొట్టుకున్నారు. మధ్యలో నన్నెందుకురా చంపుతారు’’ అన్నట్లుగా భోలే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం ఫన్నీగా అనిపించింది. అప్పటివరకు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌ల గొడవతో విసిగిపోయిన హౌస్‌మేట్స్‌కు వారి గొడవ కాస్త రిలీఫ్ ఇచ్చింది. 


ఇంతకీ ఏం జరిగింది?


నామినేషన్స్‌లో భాగంగా తేజా... అశ్వినీ శ్రీ, ఆట సందీప్‌లను ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటివరకు సందీప్ నామినేషన్స్‌లోకి రాలేదని.. ఒక్కసారి నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయినట్లయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని తేజా అన్నాడు. ఆ తర్వాత అశ్వినినీ నామినేట్ చేయడానికి రీజన్ చెప్పాడు. ‘‘డేట్ నైట్ టాస్క్ జరిగినప్పుడు.. అశ్వినీ, భోలే జంట వెళ్లొచ్చని సరదాగా అన్నాను. కానీ, అశ్వినీ నాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అలా చెయ్యడం నచ్చలేదు’’ అని తేజా తెలిపాడు. దీంతో అశ్వినీ శ్రీ.. కాసేపు తేజాతో వాదించింది. ‘‘భోలే షావలి నాకు అన్నలాంటివాడు. వయస్సులో పెద్దవాడు. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడం ఏమిటి. తేజా అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. ఆయన నా కంటే ఏజ్‌లో చాలా పెద్దవాడు. ఆయన నేను జంటగా వెళ్లడం ఏమిటీ. అసలు దీనిపై నేనే తేజాను నామినేట్ చేద్దాం అనుకున్నా. కానీ, తిరిగి అదే రీజన్‌పై తేజా నన్ను నామినేట్ చేస్తున్నాడు. భోలే వంటి పెద్ద వయస్సు వారితో కలిపి నా పేరు ఎత్తడం ఏమిటీ’’ అంటూ అశ్వినీ శ్రీ పదే పదే.. భోలే వయస్సులో పెద్దవాడు అనేలా మాట్లాడింది. పదే పదే అశ్వినీ భోలే వయస్సులో పెద్ద అనడంతో ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. చివరికి ఆయనే నిలబడి.. ‘‘నేను హీరో’’ అన్నాడు. పెద్దవాడు అనొద్దని తెలిపాడు. దీంతో అంతా నవ్వేసుకున్నారు. అశ్వినీ కూడా అంతటి ఆ విషయాన్ని ప్రస్తావించడం ఆపేసింది. దీంతో తేజా ఆమెను నామినేట్ చేశాడు.


భోలేకి శివాజీ భరోసా


ఈ వారం కూడా భోలే షావలి, అశ్వినీ శ్రీలకు గట్టిగానే నామినేషన్లు పడ్డాయి. భోలేకు 5, అశ్వినీకి నలుగురు నామినేట్ చేశారు. ఇప్పటి వరకు నామినేషన్స్‌లోకి రాని సందీప్ సైతం ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వారం శోభశెట్టికి అగ్నిపరీక్ష కావచ్చు. ఈ వారం కూడా నామినేట్ కావడంతో భోలే.. శివాజీతో మాట్లాడుతూ ఈసారి వెళ్లిపోతానేమో అని అన్నాడు. ఇందుకు శివాజీ.. భోలేకు అభయ హస్తం ఇచ్చారు. ‘‘నిన్ను నేను లేపుతా చూడు. ఆడిస్తా, పాడిస్తా.. సామాన్యులు ఉంచడానికే నేను ఉన్నది’’ అంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడినట్లు అనిపించింది.


గమనిక: ఈ సమాచారంలో పేర్కొన్న అంశాలు పూర్తిగా ప్రేక్షకులు, రివ్యూ రాసినవారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ అంశాలకు ‘ఏబీపీ దేశం’ లేదా ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.


Also Read: రతిక రోజ్ మళ్లీ వెన్నుపోటు, ఆమె రీ-ఎంట్రీకి ఓటేసిన వాడికే నామినేషన్, రెండు గంటల సేపు ఆగకుండా పోట్లాడుకున్న అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, గౌతమ్