‘బిగ్ బాస్’ నామినేషన్స్‌లో భాగంగా హౌస్‌లో వాడీవేడీ వాతావరణం నెలకొంది. ఈ వారం కూడా శోభా శెట్టి.. భోలే మధ్య వార్ జరిగింది. ఈ సారి భోలేతో వార్‌లో గౌతమ్, సందీప్‌లు కూడా చేరారు. అయితే, నామినేషన్ల పర్వం రోజంగా సాగింది. నామినేషన్లలో ఎక్కువ సమయాన్ని భోలే, పల్లవి ప్రశాంత్‌లే తీసుకున్నట్లు తెలుస్తోంది. బోలే.. గౌతమ్, శోభాశెట్టిలో వాదనలు సాగాయి. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్.. అమర్‌దీప్, గౌతమ్‌లతో వాదిస్తూ నామినేషన్ల పర్వాన్ని సాగదీశాడు. దీంతో సోమవారం ఎపిసోడ్‌లో కేవలం.. శివాజీ, శోభాశెట్టి, అశ్వినీ శ్రీ, గౌతమ్, సందీప్, ప్రియాంక, భోలే నామినేషన్లను మాత్రమే చూపించారు.
రతిక గురించి పల్లవిని అడిగిన భోలే
ఎపిసోడ్ ఆరంభంలో పల్లవి ప్రశాంత్ దగ్గరకెళ్లిన భోలే కావళి రతిక రీ ఎంట్రీ గురించి మాట్లాడాడు. ‘‘రతిక వచ్చింది కదా.. నీ ఉద్దేశం ఏమిటీ? పోనీలే పాపం అని క్షమించావా? బాధపడుతున్నావా? ఇంకా ఆ బాధ గుండెల్లో ఉందా? నిన్నటి నుంచి నిన్ను చూస్తున్నా.. దిగులుగా ఉన్నావు’’ అని భోలే అడిగాడు. ‘‘అలాంటిది ఏమీ లేదు. నిన్న నాన్నను టీవీలో చూశాను కదా. అందుకే అలా ఉన్నాను’’ అని అన్నాడు. ఆ తర్వాత నామినేషన్ పర్వం మొదలైంది.
శోభా, ప్రియాంకలను నామినేట్ చేసిన శివాజీ
ఇంట్లో ఉండడానికి ఏ ఇద్దరు అనర్హులో వారి ఫోటోలను మంటలో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ముందుగా శివాజీ.. శోభశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. భోలే విషయమై శివాజీ.. శోభను నామినేట్ చేశారు. "తను తప్పు మాట్లాడాడు 100%. రెండు వందల పర్సెంట్ తప్పే. కానీ వెంటనే ఆ విషయంపై సారీ కూడా చెప్పాడు. మన తోటి మనిషే కదా. క్షమిస్తే ఏమిపోద్ది అని నా అభిప్రాయం" అని శివాజీ అనగా.. "మీకు దేవుడు క్షమించే మనసు ఇచ్చాడు. నాకు క్షమించే మనసు ఇవ్వలేదు" అంటూ శోభ బదులు చెప్పింది. "నిన్ను మార్చే హక్కు కానీ, నిన్ను మారమని ప్రెజర్ చేసే రైట్ కానీ నాకు లేవు" అంటూ శోభ ఫోటోను శివాజీ మంటల్లో వేశారు. "కామన్ సెన్స్ కూడా ఉండదు నామినేషన్స్ వేస్తారు" అంటూ శోభ తన ఫీలింగ్ వెల్లడించింది. ‘‘మీరు చెప్పారని నేను మార్చుకోను. అది నేను మార్చుకోను’’ అని శోభా శెట్టి చెప్పింది. మీ నామినేషన్ కాబట్టి మీ పాయింట్ చెప్పండి. కానీ, మీరు ఆయన కోసం నామినేట్ చేసినట్లు ఉంది. ఇది నా క్యారెక్టర్.. నేను ఇలాగే ఉంటా’’ అని తెలిపింది. ఆ తర్వాత భోలేను థూ అని అన్నందుకు ప్రియాంకను నామినేట్ చేశాడు.
టీవీ పగలగొడతా గానీ.. నిన్ను మాత్రం చూడను
భోలే శోభాశెట్టి, గౌతమ్‌లను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా శోభాశెట్టికి సూక్తులు చెప్పాడు. ‘‘నోరు జారినప్పుడు ఎన్ని జరిగాయో తెలుసా? మీ మొండితనం మీ భవిష్యత్తుకు కూడా బాగోదు. నీకు బతిమలాడి మరీ సారీ చెప్పినా. ఇంత పంతాలు వద్దురా. సమాజానికి ఏం నేర్పుతాం. ఇంత మొండితనం అవసరం లేదు. నీ కోసం ప్రియాంక సారీ చెప్పింది’’ అని అన్నాడు. దీంతో ప్రియాంక నేను శోభాశెట్టి గురించి సారీ చెప్పలేదని, నేను చేసిన పనికి సారీ చెప్పానని తెలిపింది. ‘‘మాటలు కూడా తీసుకోండి. ఇది మూడు నెలల ఆట మాత్రమే. జీవితంలో చాలా ఎదురవ్వుతాయి’’ అని అన్నాడు. దీంతో శోభా.. మీరు మాకు జీవితం గురించి పాఠాలు చెప్పక్కర్లేదు అని తెలిపింది. ‘‘ఇంట్లో మంచి మనసుతో ఉంటావు. నామినేషన్స్‌లో ఎందుకిలా మాట్లాడుతున్నావు?’’ అని భోలే అన్నాడు. ఇందుకు శోభా.. ‘‘నేను మీకు కాదు.. మీ ఏజ్‌కు రెస్పక్ట్ ఇస్తున్నా’’ అని పేర్కొంది. దీంతో భోలే.. ‘‘నేను దిగజారి మాట్లాడేంత బజారు వాడిని కాదు’’ అని అన్నాడు. భయటకు వెళ్లి టీవీలో చూశాక.. అంటూ భోలే ఏదో చెప్పబోయాడు. ఇంతలో శోభ కలుగజేసుకుని.. ‘‘టీవీ పగలగొడతా గానీ.. నిన్ను మాత్రం చూడను. నీ సోది వినలేక అలా చేస్తున్నా. పోయి పోయి నీ మాట విని మారితే నేను ఎందుకు శోభా శెట్టి అవుతా’’ అని సమాధానం ఇచ్చింది.
శోభ vs అశ్వినీ శ్రీ
అశ్వినీ శ్రీ.. ‘‘కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు నా ఫొటోను చాలా కోపంగా విసిరేశావు’’ అని పేర్కొంది. ‘‘ఫస్ట్ నేనే వచ్చాను. అది ఎలా పడేయాలో తెలియలేదు. అందుకే, అలా వేశాను’’ అని శోభా శెట్టి చెప్పింది. ‘‘నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు కోపం ఎలా వస్తుంది’’ అని శోభాశెట్టి అడిగింది. ‘‘ఒక మనిషిని చూస్తే ఎందుకంతా చిరాకుగా చూస్తావు’’ అని అశ్వినీ శ్రీ అడిగింది. ‘‘ఒక మనిషికి మినిమం మర్యాద అనేది పేరెంట్స్ నేర్పిస్తారు’’ అని అశ్వినీ. ‘‘పేరెంట్స్ గురించి మాట్లాడకు’’ అని శోభా అన్నది. ప్రియాంకను నామినేట్ చేస్తూ.. ‘‘ఎగ్ టాస్క్ ఆడుతూ.. నన్ను నేను ప్రూవ్ చేసుకోలేదు. అందుకే ఆడతాను అన్నాను. నేను ఆడాలి.. నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా. మీరు ఇన్నాళ్లు ఆడారు.. నేను ఇప్పుడు ఆడతా అనే ఉద్దేశంతో అనలేదు’’ అని అశ్వినీ పేర్కొంది.
గౌతమ్ vs పల్లవి ప్రశాంత్
‘‘సందీప్‌ను నువ్వు ఊరోడని మాట మార్చావు. అది నాకు నచ్చలేదు’’ అంటూ గౌతమ్.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ‘‘హౌస్‌మేట్స్ మీరు వీక్ అనిపించింది. ఆ తర్వాత ‘‘ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లలో మీరు వీక్ అనిపిస్తున్నారు. అందుకే నామినేట్ చేస్తున్నా’’ అంటూ బోలేను నామినేట్ చేశాడు. భోలే స్పందిస్తూ.. ‘‘నా టీమ్‌లో నేను కరెక్టుగానే ఉన్నా. వీక్‌గా లేను. నా వీక్‌నెస్ గురించి చెప్పకు. ఆ తర్వాత ప్రియాంక వంతు వచ్చింది. నామినేషన్ కోసం ప్రియాంక భోలే ఫొటో తీయగానే.. ఆయన వెటకారంగా పాటపాడాడు. కంటెండర్‌షిప్‌ను అలా ఎలా వదిలేశారని నామినేట్ చేశారంటూ ప్రియాంక నామినేట్ చేసింది. ఆ తర్వాత అశ్వినీ శ్రీని నామినేట్ చేసింది.
సందీప్.. అశ్వినీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత భోలేని నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా భోలే.. ‘‘నువ్వు డ్యాన్సర్ కదా. నేను మోషన్స్ వస్తే తట్టుకుంటాను గానీ, ఎమోషన్స్‌ను తట్టుకోలేను అన్నాడు. దీంతో సందీప్ ‘‘నేను డ్యాన్సర్ కాదు.. నేను కొరియోగ్రాఫర్‌ను, డ్యాన్స్ డైరెక్టర్‌ను’’ అని చెప్పాడు. తన ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దని భోలేకు హెచ్చరించాడు.