బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. ఈ రియాలిటీ షోకి కోట్ల మంది అభిమానులు ఉన్నాయి. కొంతమంది ప్రేక్షకులకు షో నచ్చకపోయినా.. తిట్టుకుంటూనే చూసేస్తుంటారు. ఏడాదిలో మూడు నెలల పాటు ఈ షోని నడిపిస్తుంటారు. రీసెంట్ గానే సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ను పూర్తి చేశారు. ఈ సీజన్ కి సన్నీ విజేతగా నిలవగా.. షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు.
అయితే ఆలస్యం చేయకుండా కొత్త బిగ్ బాస్ షోతో మిమ్మల్ని అలరిస్తామని చెప్పారు హోస్ట్ నాగార్జున. అయితే ఈసారి ఓటీటీ వెర్షన్ ను ప్లాన్ చేశారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ షో కేవలం పది వారాలు మాత్రమే ఉంటుందట.
టీవీల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వంద రోజులకు పైగానే ఉంటుంది. కానీ ఓటీటీ వెర్షన్ మాత్రం పది వారాల వరకే ప్లాన్ చేస్తున్నారట. ఎక్కువ సాగదీయకుండా.. ఉన్నంతలో ఎమోషనల్ గా షోని నడిపించడానికి భావిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు పదిహేను మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఓటీటీ వెర్షన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఆయనకు ఇది డబుల్ బొనాంజా అనే చెప్పాలి. రెండు బిగ్ బాస్ షోలతో డబుల్ రెమ్యునరేషన్ సంపాదించేస్తున్నారు. ప్రస్తుతం ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో హౌస్ సెట్ వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ షోని హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు.
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..