కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రి నుంచి పునీత్ పార్థీవ శరీరాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అభిమానులు, ప్రజల సందర్శన కోసం కంఠీరవ స్టేడియానికి తీసుకువెళ్లారు. అక్కడే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. పునీత్ తల్లితండ్రులు పార్వతమ్మ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలను కూడా ఈ స్టేడియంలోనే నిర్వహించారు.
కంఠీరవ స్టేడియానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తండోప తండాలుగా తరలివెళ్తున్నారు. పునీత్‌కు నివాళ్లు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సైతం కంఠీరవ స్టేడియానికి చేరుకుని పునీత్ భౌతికకాయానికి కన్నీటి నివాళులు అర్పించారు. పునీత్ పార్థీవ శరీరాన్ని చూడగానే బాలకృష్ణ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. తల కొట్టుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ను పరామర్శించి.. కాసేపు అక్కడే నిలుచున్నారు. బాలకృష్ణతోపాటు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవ కూడా అక్కడికి చేరుకుని పునీత్‌కు నివాళులు అర్పించారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ సైతం.. పునీత్ భౌతిక కాయాన్ని చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ అన్న శివ రాజ్‌కుమార్‌ను హత్తుకుని ఓదార్చారు. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి రానా, శివబాలాజీ అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. చిరంజీవి, రామ్ చరణ్ సైతం వెళ్తారని సమాచారం.
తొలుత అంతిమ సంస్కారాలు శనివారం నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే, అమెరికాలో ఉంటున్న పునీత్ రెండో కుమార్తె వందిత బెంగళూరు చేరడానికి సాయంత్రం అవుతుంది. దీంతో అంతిమ సంస్కరాలను ఆదివారానికి వాయిదా వేశారు. పునీత్‌కు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలకనున్నారు. పునీత్ మృతికి సంతాపంగా కర్ణాటకలో థియేటర్లను మూసివేశారు. మూడు రోజుల పాటు మద్యపాన నిషేధం విధించారు. పునీత్ మరణవార్త తెలిసిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆసుపత్రికి చేరుకున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినిమా, క్రికెట్ ప్రముఖులు పునీత్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం...
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి