'అవతార్' (Avatar Movie)... భారతీయ ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేని సినిమా పేరు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని తేడాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో విజయం సాధించింది. జేమ్స్ కామెరూన్  (James Cameron) క్రియేట్ చేసిన పండోరా గ్రహం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పండోరా గ్రహంలో జీవులు కూడా నచ్చేశాయి. ఇప్పుడు 'అవతార్'కు సీక్వెల్ వస్తోంది. భారతీయుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాపై ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణ... అడ్వాన్స్ బుకింగ్స్!


డిసెంబర్ 16న విడుదల కానున్న 'అవతార్ 2' (Avatar 2) విడుదల అవుతోంది. మన దేశంలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతోంది. అన్ని భాషల్లో ప్రీ సేల్స్ బావున్నాయి. టికెట్స్ బాగా అమ్ముడు అవుతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. 


'అవతార్ 2' @ రెండు లక్షల టికెట్లు
కొన్ని రోజుల క్రితం ఇండియాలో 'అవతార్ 2' టికెట్స్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు అయ్యాయి. ఆ జోరు అలా కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉంది. అయితే, ప్రేక్షకులు ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఆ రోజు వరకు వేచి చూసే ధోరణిలో లేరు.
 
ఇప్పటి వరకు ఇండియాలో సుమారు 2.20 లక్షల మంది 'అవతార్ 2' టికెట్స్ బుక్ చేసుకున్నారు. కలెక్షన్స్ పరంగా చూస్తే... ఎనిమిదిన్నర కోట్ల రూపాయలకు పై మాటే. అందులో ఫస్ట్ డే కలెక్షన్స్ మూడున్నర కోట్ల రూపాయలు. మిగతావి శని, ఆదివారం కలెక్షన్స్. ప్రస్తుతం బాక్సాఫీస్ బరిలో 'అవతార్ 2' జోరు చూస్తుంటే... ఫస్ట్ డే పది కోట్లు అనేది చాలా చిన్న మాట. 


Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?


'అవతార్ 2'కు వస్తున్న వసూళ్ళలో 75 శాతం మల్టీప్లెక్స్ చైన్స్ నుంచి అని టాక్. నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ బావుంటే... సౌత్ ఇండియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ బావున్నాయి. ఇండియాలో 'అవతార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి మూడు రోజులలో 45 స్క్రీన్‌లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మాట్ టిక్కెట్లు సేల్ అవ్వడం విశేషం. విడుదల సమయానికి ఇంకా స్క్రీన్స్ పెరుగుతాయి. వసూళ్లు ఇంకా భారీగా ఉంటాయి. 


'అవతార్' వచ్చి పదమూడేళ్ళు!
'అవతార్' వచ్చి పదమూడేళ్ళ. ఆ సినిమా 2009లో విడుదలైంది. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. సుమారు 250 మిలియన్ డాలర్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఆ సినిమా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. పదమూడేళ్ళ తర్వాత సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నా... ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా ఉండటం విశేషం. దీనికి ఏ స్థాయిలో వసూళ్ళు వస్తాయో చూడాలి.


Also Read : పని లేక పండోరా గ్రహం క్రియేట్ చేయలేదు - జేమ్స్ కామరూన్ 'అవతార్' ఎందుకు అంత స్పెషల్ అంటే?