Tollywood 2022 Review : రీమేక్ సినిమాలు అంటే కొంత మందికి సదభిప్రాయం లేకపోవచ్చు. క్రియేటివిటీ ఏముంది? కొత్తగా చేసేది ఏం ఉంటుంది? మరో భాషలో విజయవంతమైన కథను తీసుకుని తీయడమేగా? అని విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
 
రీమేక్ అంటే ఓ గోడకు ఉన్న మేకు తీసి మరో గోడకు కొట్టినంత ఈజీ కాదు. ఉన్నది ఉన్నట్టు తీస్తే... కాపీ పేస్ట్ చేశారంటారు. మార్పులు చేస్తే కథను చెడగొట్టారని చెబుతారు. పరభాషలో సినిమా విజయానికి కారణాలు ఏంటి? మన భాషలో విజయం సాధించడానికి అవసరమైన అంశాలు ఏంటి? అని లెక్కలు వేసుకుని తీయాలి. ప్రతి ఏడాదీ ఈ తంతు కామన్. 2022 ఇయర్ ఎండ్ వచ్చేసింది. ఈ ఏడాది వచ్చిన రీమేక్స్ ఎన్ని? అందులో హిట్లు ఎన్ని? ఫ్లాపులు ఎన్ని? అని చూస్తే...
 
మెగా రీమేక్స్... ఏకంగా ముగ్గురు!
తెలుగులో ఈ ఏడాది వచ్చిన రీమేక్స్‌లో 'గాడ్ ఫాదర్' (Godfather), 'భీమ్లా నాయక్' (Bheemla Nayak), 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo) ఉన్నాయి. ఈ మూడు సినిమాలు మెగా ఫ్యామిలీ హీరోలు చేసినవే. మూడు సినిమాలకు హిట్ టాక్ లభించింది. కమర్షియల్ పరంగా బాక్సాఫీస్ వసూళ్ళు ఎలా ఉన్నాయి? అనేది పక్కన పెడితే... హీరోలు ముగ్గురూ, వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు. 


రీమేక్ రాజాలు ఇంకెవరు?
హీరో వెంకటేష్‌కు రీమేక్ రాజా అని పేరుంది. ఈ ఏడాది కూడా ఆయన ఓ రీమేక్‌లో కనిపించారు. అయితే... అందులో హీరో ఆయన కాదు, విశ్వక్ సేన్. ఆ సినిమా 'ఓరి దేవుడా'. రీమేక్స్ విషయంలో వెంకటేష్ లాంటి పేరున్న మరో హీరో రాజశేఖర్. ఈ ఏడాది ఆయన చేసిన 'శేఖర్' రీమేకే. హీరోయిన్ రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'శాకిని డాకిని' కొరియన్ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్'కు రీమేక్.


చిరు.. పవన్... వెంకీ...
హిట్టు హిట్టు! ఎవరు ఫ్లాప్?
'గాడ్ ఫాదర్'తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), 'భీమ్లా నాయక్'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), 'ఓరి దేవుడా'తో విక్టరీ వెంకటేష్ (Venkatesh) విజయాలు అందుకున్నారు. ఈ మూడు సినిమాలు కమర్షియల్ పరంగా మంచి వసూళ్ళు సాధించాయి. 'ఊర్వశివో రాక్షసివో'లో వినోదం బావుందని మంచి పేరు వచ్చింది. కానీ, వసూళ్ళు మాత్రం ఆశించిన రీతిలో లేవు. దాంతో అల్లు శిరీష్ (Allu Sirish) సినిమా కమర్షియల్ లెక్కల పరంగా వెనుకబడింది. 'ఓరి దేవుడా'తో విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఇంతకు ముందు ఓ మలయాళ సినిమాను తెలుగులో 'ఫలక్‌నుమా దాస్'గా రీమేక్ చేసి ఆయన విజయం అందుకున్నారు. 


మార్పులు చేశారు...
విజయలొచ్చాయ్!
'గాడ్ ఫాదర్', 'భీమ్లా నాయక్'... రెండూ వేర్వేరు సినిమాలు కావచ్చు. కానీ, రెండిటికీ ఓ పోలిక ఉంది. రెండూ మలయాళ సినిమా రీమేకులే. ఒరిజినల్ సినిమాలను చూస్తే... ఓ విషయం అర్థం అవుతుంది. రెండు కథల్లో మార్పులు, చేర్పులు బాగా జరిగాయి. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టు కథల్ని మార్చేశారు. సన్నివేశాలను కొత్తగా వండారు. ఆ మార్పులు, చేర్పులు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అయితే... చిరు, పవన్ ఇమేజ్ రేంజ్ సక్సెస్ సాధించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కొరియన్ సినిమాలో హీరోలు ఉంటే... జెండర్ స్వైప్ చేసి, తెలుగులో హీరోయిన్లను పెట్టి 'శాకిని డాకిని' తీశారు. మార్పులు చేసినా విజయం మాత్రం రాలేదు.  
 
కేసుల్లో కిల్ అయిన 'శేఖర్'
'శేఖర్'ది విచిత్రమైన పరిస్థితి. ఆ సినిమాకు డీసెంట్ రివ్యూలు వచ్చాయి. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కు విజయం అందించిందా? ఫ్లాప్ అయ్యిందా? అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే... సినిమా విడుదలైన రెండో రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. రాజశేఖర్ లాస్ట్ సినిమాకు ఫైనాన్స్ చేసిన వాళ్ళు కేసు వేయడంతో థియేటర్లలో షోలు పడలేదు. ఒకవేళ కేసు వేసిన వాళ్ళు వచ్చిన డబ్బులు తమకు వచ్చేలా ఆర్డర్స్ ఇవ్వమని కోరితే పరిస్థితి ఎలా ఉండేదో?వాళ్ళు అలా చేయలేదు. ఏకంగా షోలు ఆపేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కిల్ అయ్యాయి.


'శాకిని డాకిని' పబ్లిసిటీలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మగవాళ్ళను మ్యాగీతో పోలుస్తూ రెజీనా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మూవీ రిజల్ట్ దానికి రివర్స్‌లో ఉంది. ఆ వీడియో చూసినంత మందిలో కనీసం సగం మంది కూడా థియేటర్లకు రాలేదు. దాంతో రెండో రోజుకు సినిమా తీసేయాల్సి వచ్చింది. 


రాబోయే సినిమాల్లో గుర్తుందా?
ఈ శుక్రవారం (డిసెంబర్ 9న) విడుదల అవుతున్న 'గుర్తుందా శీతాకాలం' కన్నడ హిట్ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్. అయితే... కాపీ పేస్ట్ చేయకుండా మార్పులు చేశామని హీరో సత్యదేవ్ చెప్పారు. ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లు. 


Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం! ఆయన్ను ఎందుకు గురూజీ అంటున్నారు?


తమిళంలో ఇంకా విడుదల కాని 'చతురంగ వెట్టై 2'కు 'ఖిలాడీ' రీమేక్ అని ఓ టాక్. అయితే... అందులో నిజం లేదని, ఇంటర్వెల్ ట్విస్ట్ సేమ్ కావడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి నటించిన 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాపై స్పానిష్ ఫిల్మ్ '4x4' ప్రభావం ఉందని విమర్శలు చెప్పే మాట. దాన్ని దర్శకుడు ఖండించారు. 


నవీన్ చంద్ర హీరోగా నటించిన 'రిపీట్' ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. తమిళ సినిమా 'డెజావు'కు రీమేక్ ఇది. ఆ మాటకు వస్తే... సెమీ డబ్బింగ్ అని చెప్పాలి. నవీన్ చంద్ర సన్నివేశాలు రీషూట్ చేసి... మధుబాల సన్నివేశాలను డబ్బింగ్ చేశారు మరి!


Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?