Akkineni Family Donation: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి. పలు జిల్లాల్లో గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. పలు ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం, పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పలు ప్రాంతాలు నీళ్లలోనే మునిగి ఉండగా, మరికొన్ని చోట్ల వరద తగ్గినా, బురద మిగిలే ఉంది. ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా ప్రభుత్వాలు సైతం సహాయక చర్యలు చేపడుతున్నాయి. రోడ్ల మరమ్మతులు చేయించడంతో పాటు వరదల కారణంగా సర్వం కోల్పోయిన అభాగ్యులకు అండగా నిలుస్తున్నాయి.
వరద బాధితుల సాయం కోసం రూ. కోటి విరాళం
అటు ఉభయ రాష్ట్రాల్లో వరద సహాయక కార్యక్రమాల కోసం సినీ నటులు ముందుకు వస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యంత్రులు సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్థికసాయం చేయగా, తాజాగా అక్కినేని ఫ్యామిలీ పెద్ద మొత్తంలో విరాళం అందిస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ. కోటి సాయం ప్రకటించింది. “దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ముందు ఉండేవారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ ఆయన ముందుండి విరాళాలు సేకరించారు. ఆయన బాటలోనే మేమూ నడుస్తున్నాం. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ. 50 లక్షలను విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం” అని అక్కినేని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందిస్తున్నాయి.
Also Read: బాసూ.... మీది మెగా మనసు - చిరు, పవన్ తర్వాత గ్లోబల్ స్టార్ భారీ సాయం, ఎంత విరాళం ఇచ్చారంటే?
రూ. 2 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభాస్
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సాయం కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. ప్రభాస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ. 2 కోట్లు సాయం అందిస్తున్నట్లు ప్రభాస్ వెల్లడించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి ఇస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి సైతం తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు పెద్ద మొత్తంలో సాయం చేశారు. తన వంతు చేయూతగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళంగా అందించనున్నట్టు ప్రకటించారు. అటు అల్లు అర్జున్.. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.కోటి అందిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.