నందమూరి, అల్లు కుటుంబాల మధ్య అనుబంధం గురించి ఇటీవల జరిగిన 'అన్ స్టాపబుల్' కర్టైన్ రైజర్ ఈవెంట్‌లో నట సింహం బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, అల్లు రామలింగయ్య ఎంత సన్నిహితంగా ఉండేవారనేది ఆయన చెప్పుకొచ్చారు. వారి తర్వాత తరాల మధ్య కూడా ఆ సాన్నిహిత్యం కొనసాగుతోంది. అల్లు ఫ్యామిలీ భాగస్వామ్యం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ వేదిక 'ఆహా' కోసం బాలకృష్ణ ఓ టాక్ షో చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా వేడుకకు అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.
బాలకృష్ణ నటించిన తాజా సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్, ఈ వేడుకకు అల్లు అర్జున్ గెస్టుగా వచ్చారు. డైరెక్టర్ రాజమౌళి కూడా హాజరయ్యారు.
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు బోయపాటితో అల్లు అర్జున్ 'సరైనోడు' చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను బోయపాటి ఓ వేదికపైకి తీసుకొచ్చారు.
'అఖండ' సినిమాతో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో, నటుడు శ్రీకాంత్ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఆయన ఎలా చేశారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషించారు. భారీ తారాగణం సినిమాలో ఉంది.