'ఆదిపురుష్' (Adipurush Movie) ప్రారంభమైనప్పటి నుంచి తాజాగా టీజర్ విడుదల వరకూ... సినిమాకు సంబంధించిన ప్రతి అంశం వార్తల్లో ఉంటోంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండటమే అందుకు కారణం! ఇందులో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించారు. టీజర్ విడుదల అయిన తర్వాత ఆయన అభిమానులు, ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ వచ్చాయి. 


'ఆదిపురుష్' టీజర్ చూశాక... ఓం రౌత్ మీద ప్రేక్షకులకు కోపం వచ్చింది ఏమో కానీ, సినిమా నిర్మాత మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పాలి. లేదంటే నాలుగు కోట్ల రూపాయల ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వరు కదా! 


ఓం రౌత్‌కు 'ఆదిపురుష్' చిత్ర నిర్మాతలలో ఒకరైన టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఫెరారీ  ఎఫ్8 (Ferrari F8 Tributo) కారును ఇచ్చారట. దాని ఖరీదు సుమారు నాలుగు కోట్ల రూపాయలు అని సమాచారం. అయితే, అది కొత్త కాదు కాదు. షోరూమ్ నుంచి తీసుకు రాలేదు. ఇంతకు ముందు భూషణ్ కుమార్ కొనుకున్న కారు. 'ఆదిపురుష్' చిత్రానికి ఓం రౌత్ చేసిన వర్క్ చూసి కారును ఇచ్చారని ముంబై టాక్. 


ఓం రౌత్ ఈ విధంగా ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. 'భూల్ భులయ్యా 2' భారీ విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాలో హీరో కార్తీక్ ఆర్యన్‌కు రూ 4.70 కోట్లు ఖరీదు చేసే మెక్ లారెన్ కారును బహుమతిగా ఇచ్చారు.


'ఆదిపురుష్' విషయానికి వస్తే... సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మధ్య టీజర్ విడుదల చేశారు. ఆదివారం (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ లేదంటే వీడియో చేయనున్నారని సమాచారం.


Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?






'ఆదిపురుష్' దర్శకుడికి నిర్మాత కారు ఇవ్వడం చూస్తే... విమర్శలను వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ట్రోల్స్, మీమ్స్ పక్కన పెడితే, టీజర్ విడుదలైన తర్వాత తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ కొందరు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బ తీసేలా 'ఆదిపురుష్'లో సన్నివేశాలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి మాళవికా అవినాష్ పేర్కొన్నారు.



మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం టీజర్ విడుదలైన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలిపాయి. అయోధ్యలోని పూజారి సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.






'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు.  సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.