సినిమా రివ్యూ : అమ్ము 
రేటింగ్ : 3/5
నటీనటులు : ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర, బాబీ సింహ, సత్య కృష్ణన్, ప్రేమ్ సాగర్, రఘుబాబు, అంజలి అమీర్, రాజా రవీంద్ర, అప్పాజీ అంబరీష తదితరులు
మాటలు : పద్మావతి మల్లాది
ఛాయాగ్రహణం : అపూర్వ అనిల్ శాలిగ్రాం
సంగీతం: భరత్ శంకర్ 
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు : కళ్యాణ్ సుబ్రమణియన్, కార్తికేయన్ సంతానం
రచన, దర్శకత్వం : చారుకేశ్ శేఖర్
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2022
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో


ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lekshmi), నవీన్ చంద్ర, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అమ్ము' (Ammu Movie). ప్రచార చిత్రాలు చూస్తే... భర్త చేతిలో హింసకు గురయ్యే భార్యగా ఐశ్వర్య లక్షి కనిపించారు. మరి, సినిమా (Ammu Review) ఎలా ఉంది? గృహ హింస నేపథ్యంలో ఎటువంటి సందేశం ఇచ్చారు?


కథ (Ammu Movie Story) : రవి... రవీంద్రనాథ్ (నవీన్ చంద్ర) పోలీస్ అధికారి. ఓ ఎస్సై. అమ్ము... అముద (ఐశ్వర్య లక్ష్మీ) అతడి పొరుగింటి అమ్మాయి. పెద్దలు ఇద్దరితో ఏడడుగులు వేయిస్తారు. పెళ్ళైన కొత్తలో అంతా బావుంది. భార్యను రవి బాగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడి అసలు రంగు బయట పడింది. చిన్న చిన్న విషయాలకు భార్యపై కోప్పడటం, కొట్టడం మొదలు పెట్టాడు. భర్తను వదిలి, ఇల్లు విడిచి వెళ్లిపోవాలని అమ్ము అనుకుంటుంది. కానీ, వెళ్ళలేదు. ఎందుకు? తనను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తను భరించక తప్పదనుకుని సర్దుకుపోయిందా? లేదంటే ఏమైనా చేసిందా? రవి, అమ్ము దంపతుల మధ్య పెరోల్ మీద బయటకొచ్చిన హంతకుడు ప్రభు (బాబీ సింహ) ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. 


విశ్లేషణ (Ammu Movie Review) : డొమెస్టిక్ వయలెన్స్... గృహ హింస... ఏ భాషలో చెప్పినా భావం ఒక్కటే! ఈ అంశం మీద హిందీలో తాప్సీ 'థప్పడ్', ఆలియా భట్ 'డార్లింగ్స్' చిత్రాలు వచ్చాయి. తెలుగులో గృహ హింస నేపథ్యంలో కొన్ని చిత్రాల్లో సన్నివేశాలు ఉన్నాయి. అయితే... గృహ హింస ప్రధానాంశంగా రూపొందిన చిత్రం 'అమ్ము' అని చెప్పాలి. ఈ సినిమా ఎలా ఉందనే విషయంలోకి వెళితే...


'మొగుడు అన్నాక కొడతాడు... భార్య భరించాలి, సర్దుకుపోవాలి'
- మన సమాజంలో తరతరాల నుంచి నాటుకుపోయిన భావన ఇది. 


'ఒక మగాడు పెళ్ళాం మీద చెయ్యి ఎత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో... వాడితో ఒక్క క్షణం కూడా పెళ్ళాం ఉండాల్సిన అవసరం లేదు'
- ఇదీ 'అమ్ము'లో అమ్మాయితో తల్లి చెప్పే మాట!


తల్లి మాట విని భర్త కొట్టిన తర్వాత బ్యాగ్ సర్దుకుని అమ్మాయి వచ్చేస్తే 'అమ్ము' కథ ముప్పావుగంటలో ముగిసేది. కథలో అసలు విషయం ఇదేనని తెలిసిన తర్వాత చూసేటప్పుడు ఆసక్తి ఏముంటుంది? అనుకునే పాఠకులూ ఉండొచ్చు. 'అమ్ము'లో అసలు విషయం కంటే మించి బలమైన సంఘర్షణ ఉంది. అది మనల్ని చివరి వరకూ సినిమా చూసేలా చేస్తుంది. 


అమ్మ మాట విని ఆడపిల్ల బ్యాగ్ సర్దుకుని వచ్చేయడం అంత సులభం కాదనే విషయాన్ని 'అమ్ము'లో చూపించారు. అందుకు ఎన్నో అడ్డంకులు! కొన్నిసార్లు  భర్తకు భార్య భయపడితే... కొన్నిసార్లు బంధాన్ని నిలుపుకోవాలనే ఆలోచన, ప్రేమ అడ్డు గోడలు అవుతాయని సూటిగా, స్పష్టంగా చెప్పారు. అసలు విషయం చెప్పే క్రమంలో దర్శకుడు కొంత స్వేచ్ఛ తీసుకున్నారు. 


రవి పాత్రలో ఒక్కసారిగా వచ్చే మార్పు ఆశ్చర్యానికి గురి చేస్తే... పోలీసుల కళ్ళు గప్పి హంతకుడిని దాచడం అంత సులభమా? అనిపిస్తుంది. కథకు అనుకూలంగా కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నారు. అవి పంటి కింద రాయిలా తగులుతాయి. భార్యను కొట్టి తర్వాత సారీ చెప్పి, మళ్ళీ కొట్టే  రవి లాంటి పాత్రలను ఇంతకు ముందు చూశాం కూడా! 'డార్లింగ్స్'లో విజయ్ వర్మ పాత్ర కూడా అలానే ఉంటుంది. అయితే... ఐశ్వర్య పాత్రను మలచిన విధానం కొత్తగా ఉంది. కథను ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు... మొదటి గంట తర్వాత కొన్ని తప్పటడుగులు వేశారు. బాబీ సింహ పాత్ర, జైలు బయట అతని కోసం ధర్నా చేసే సన్నివేశాలు కథను కొంత సైడ్ ట్రాక్‌లోకి తీసుకు వెళ్లాయి. నిడివి పెంచాయి. మళ్ళీ ముగింపులో మెరుపు చూపించారు. కథ, కథనం కంటే కథలో అమ్ము పాత్ర తాలూకు సంఘర్షణ, సంభాషణలు ఎక్కువ ఆకట్టుకుంటాయి. కథతో ప్రయాణించేలా చేస్తాయి. 


ఇల్లు, పోలీస్ స్టేషన్, ఇంటి ఆవరణ... సినిమాలో పెద్దగా లొకేషన్లు లేవు. కానీ, ఆ ఫీలింగ్ ఆడియన్‌లో రానివ్వకుండా సినిమాటోగ్రాఫర్ అపూర్వ అనిల్ శాలిగ్రాం మాయ చేశారు. మనల్ని సినిమాలోకి తీసుకు వెళ్లారు. సంగీతం కూడా అంతే! సాంకేతికంగా సినిమా బావుంది. ఓటీటీకి బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. కొన్ని కొన్ని లోపాలు ఏవైనా ఉంటే... నటీనటులు తమ అభినయంతో కవర్ చేసేశారు.  


నటీనటులు ఎలా చేశారు? : అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మీ జీవించారు. ముఖ్యంగా ఆమె కన్నీరు పెట్టుకుంటుంటే... కొన్నిసార్లు మనమూ ఎమోషనల్ అవుతాం. భర్త తనపై చెయ్యి చేసుకోవడం సహించలేని తనం, అదే సమయంలో నిస్సహాయతను వ్యక్తం చేసే సన్నివేశాల్లో ఐశ్యర్య లక్ష్మీ అభినయం అద్భుతం! నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను ఇంతకు ముందు నవీన్ చంద్ర చేశారు. ఆయనకు ఈ క్యారెక్టర్ చేయడం పెద్ద ఛాలెంజ్ ఏమీ కాదు. అయితే... పతాక సన్నివేశాల్లో భార్య ధైర్యంగా ముందడుగు వేసి, డీఐజీ దగ్గర నిలబడిన సన్నివేశంలో నవీన్ చంద్ర ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నటుడిగా అతడిని మరో మెట్టు ఎక్కించింది. బాబీ సింహ, ప్రేమ్ సాగర్, సత్య కృష్ణన్, సంజయ్ స్వరూప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. రఘుబాబు కనిపించేది రెండు సన్నివేశాల్లో అయినప్పటికీ... కథలో కీలక పాత్ర చేశారు.  


Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : మహిళలు ధైర్యంగా ఉండాలని చెప్పే చిత్రమిది. మహిళలకు ధైర్యం ఇచ్చే చిత్రమిది. కథానాయిక పాత్ర కొత్తది ఏమీ కాదు. ప్రతి పల్లెలో, పట్టణంలో, నగరంలో ఒక అమ్ము ఉంటుంది. మనసులో తనను తానుగా అమ్ము వేసుకున్న కంచె నుంచి ఆమె బయటకు రావాలని, భయాన్ని వీడాలని చెప్పే చిత్రమిది. సింపుల్ స్టోరీని ఐశ్యర్య లక్ష్మీ, నవీన్ చంద్ర తమ అభినయంతో చివర వరకు చూసేలా చేశారు. కొన్ని సీన్స్ లాజిక్‌కు దూరంగా ఉన్నా సరే... వీకెండ్ 'అమ్ము'ను చూడొచ్చు. 'అమ్ము' ఎమోషన్, యాక్టింగ్ & క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ మనసును తాకుతుంది.


Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?