సినిమా రివ్యూ : కాంతార
రేటింగ్ : 3.5/5
నటీనటులు : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, షానిల్ గురు, మానసి సుధీర్, స్వరాజ్ శెట్టి తదితరులు
ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్. కశ్యప్ 
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్‌
తెలుగులో విడుదల : అల్లు అరవింద్ (తెలుగులో)
నిర్మాత : విజయ్ కిరగందూర్ 
రచన, దర్శకత్వం : రిషబ్ శెట్టి 
విడుదల తేదీ: అక్టోబర్ 15, 2022 (తెలుగులో)


థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన సినిమా 'కాంతార' (Kantara Telugu Movie) అని ప్రభాస్ పోస్ట్ చేశారు. ఆయనతో 'సలార్' నిర్మిస్తున్న, 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ నిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ నిర్మించిన తాజా చిత్రమిది. కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలైంది.  ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది (Kantara Movie Review Telugu)?  


కథ (Kantara Story) : అనగనగా ఒక ఊరు. అడవిని అనుకుని ఉన్న ఆ ఊరిలో ప్రజలకు ఆ భూమిని కొన్నేళ్ల క్రితం రాజు రాసి ఇస్తాడు. అందుకు బదులుగా ఊరి భగవంతుడిని తమ ఇంటికి తీసుకువెళతాడు. అయితే... రాజు కుమారుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించగా, కోర్టు మెట్లు మీద రక్తం కక్కుకుని మరణిస్తాడు. కట్ చేస్తే... కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, దానిని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) సర్వే చేస్తుంటాడు. ఊరిలో యువకుడు శివ (రిషబ్ శెట్టి)కి, ఫారెస్ట్ ఆఫీసర్‌కి గొడవలు కూడా అవుతాయి. తమకు అండగా రాజ వంశీకులు, ఊరంతా దోరగా కొలిచే దేవేంద్ర (అచ్యుత్ కుమార్) ఉన్నాడని శివ నమ్ముతాడు. అయితే... దేవేంద్ర ఏం చేశాడు? ఊరిలో దేవ నర్తకుడి (భగవంతుడి వేషధారణ వేసి, భగవంతుడి మాటలను ప్రజలకు చెప్పే వ్యక్తి) గురవను చంపింది ఎవరు? ఎవరి వ్యక్తిత్వం ఏమిటనేది శివకు ఎప్పుడు తెలిసింది? అతడికి పీడ కలలు ఎందుకు వస్తున్నాయి? ఊరిని, ఊరి ప్రజలను కాపాడటం కోసం భగవంతుడు ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (Kantara Movie Review) : ప్రతి శుక్రవారం ఒకటి కంటే ఎక్కువ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే... కొన్ని సినిమాలు మాత్రమే అన్నిటిలో కల్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొత్త సినిమా చూసిన ఫీలింగ్ మనకు ఇస్తాయి. ఓ కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకు వెళతాయి. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారని మన మనసుకు తెలిసేలా చేస్తాయి. అటువంటి చిత్రమే 'కాంతార : లెజెండ్'.


రెండు మూడు లైన్లతో 'కాంతారా' కథను చెబితే... 'ఓస్! ఇంతేనా? ఇందులో కొత్త ఏముంది?' అనిపించవచ్చు. తమ పూర్వీకులు ప్రజలకు ఇచ్చిన భూమిని మళ్ళీ సొంతం చేసుకోవడానికి వారసులు ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలకు దేవుడు అడ్డుగా నిలవడమే 'కాంతార' చిత్రకథ. అయితే... ఈ కథను రిషబ్ శెట్టి చెప్పిన విధానం అడుగడుగునా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.


'కాంతార' ప్రారంభమే మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. అందుకు కారణం కథ లేదంటే కథనమో కాదు... నేటివిటీ, సంగీతం, సినిమాటోగ్రఫీ. కన్నడ మట్టిలోంచి పుట్టిన కథ 'కాంతార'. దేవ నర్తకుడి ఆహార్యం అబ్బురపరుస్తుంది. ప్రతి పాత్ర కథలో నుంచి పుట్టకు వచ్చింది. కామెడీ కోసం సెపరేట్‌గా ట్రాక్స్, క్యారెక్టర్స్ రాయలేదు. అడవి గ్రామాల్లో పాత్రలు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తాయి? అనేది చూపిస్తూ నవ్వించారు. అటవీ నేపథ్యాన్ని, పురాణ గాథను మిళితం చేసిన తీరు బావుంది. 


కథగా చూస్తే... ముందు చెప్పినట్లు కొత్త కాదు. ఇటువంటి కథలు కొన్ని వచ్చాయి. కథలో ట్విస్ట్ ఊహించడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు. మంచితనం ముసుగు వేసుకుని మోసాలు చేసే పాత్రను ప్రేక్షకులను ఊహించవచ్చు. ఇంటర్వెల్ తర్వాత కథనం కొంత నెమ్మదిస్తుంది. డిటైలింగ్ పేరుతో నిదానంగా తీసుకు వెళ్లారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథ సగటు సినిమాల్లో ప్రేమకథలా సాగడం మరో మైనస్. ఉద్యోగం ఇప్పించినందుకు అమ్మాయి ప్రేమలో పడటం ఏమిటో? అయితే... ఆ తర్వాత ఉద్యోగానికి, ఊరికి మధ్య నలిగిపోయే పాత్రలో సప్తమి గౌడ నటన బావుంది. 


కథకుడిగా కంటే దర్శకుడిగా రిషబ్ శెట్టి ఎక్కువ ప్రతిభ చూపించారు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్. కశ్యప్ నుంచి బెస్ట్ అవుట్‌పుట్‌ తీసుకున్నారు. స్టంట్ కొరియోగ్రఫీ కూడా బావుంది. ప్రతి ఫైటులో, పాటలో సంగీతం సూపర్బ్. నేపథ్యంలో అజనీష్ కొత్త సంగీతాన్ని వినిపించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్నాయి. హోంబలే ఫిలింస్ అంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. 


నటీనటులు ఎలా చేశారు? : సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అద్భుతంగా నటించారు. అయితే... థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు రిషబ్ శెట్టి తప్ప ఇంకెవరూ గుర్తు ఉండరు. సినిమా అంతా ఒక ఎత్తు... పతాక సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన మరో ఎత్తు. ఇంకెవరూ ఆ సన్నివేశం చేయలేరనే విధంగా ఆయన విశ్వరూపం చూపించారు. రిషబ్ శెట్టి జోడీగా సప్తమి గౌడ నటన చాలా సహజంగా ఉంది. అచ్యుత్ కుమార్, కిశోర్ మరోసారి తమ ప్రతిభ చూపించారు. హీరో గ్యాంగ్‌లో స్త్రీ లోలుడిగా కనిపించే వ్యక్తి నుంచి... లోపల భయం ఉన్నప్పటికీ, పైకి గంభీరంగా కనిపించే వ్యక్తి పాత్ర చేసిన వ్యక్తి వరకూ చాలా మంది నటీనటులు రిజిస్టర్ అవుతారు.  


Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : రిషబ్ శెట్టి విశ్వరూపం 'కాంతార : లెజెండ్'. హీరోగా ఆయన నటన, దర్శకుడిగా ఆయన తీసిన కొన్ని సన్నివేశాలు కొన్నాళ్ళ పాటు  ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది. కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. కన్నడ నేటివిటీలో కథ సాగినప్పటికీ... అన్ని భాషల ప్రేక్షకులను ఇందులో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. సంగీతం బావుంది. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. క్లైమాక్స్ ముందు వరకూ ఇది సగటు చిత్రమే... దాన్ని మరో మెట్టు ఎక్కించిన ఘనత మాత్రం పతాక సన్నివేశానికి, అందులో రిషబ్ శెట్టి నటనకు దక్కుతుంది. డోంట్ మిస్ క్లైమాక్స్. టైటిల్ పడిన తర్వాత బయటకు రావొద్దు. 


Also Read : 'బాయ్‌ఫ్రెండ్ ఫ‌ర్ హైర్' రివ్యూ : అద్దెకు ఓ అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకుంటే? విశ్వంత్ సినిమా ఎలా ఉందంటే?