సినిమా రివ్యూ : క్రేజీ ఫెలో
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆది సాయి కుమార్, దిగంగనా సూర్యవన్షి, మిర్నా మీనన్, నర్రా శ్రీనివాస్, సప్తగిరి, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథ్ తదితరులు
ఛాయాగ్రహణం : సతీష్ ముత్యాల
సంగీతం: ఆర్ఆర్ ధృవన్
సమర్పణ : లక్ష్మీ రాధామోహన్
నిర్మాత: కె.కె. రాధామోహన్
రచన, దర్శకత్వం : ఫణికృష్ణ సిరికి
విడుదల తేదీ: అక్టోబర్ 14, 2022
విజయం కోసం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న యువ కథానాయకుడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). ఆయన సరైన సూపర్ హిట్ అందుకుని చాలా రోజులైంది. ఈ రోజు 'క్రేజీ ఫెలో' సినిమాతో థియేటర్లలో వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? (Crazy Fellow Review)
కథ (Crazy Fellow Movie Story) : అభిరామ్ (ఆది సాయి కుమార్) తల్లిదండ్రులు చిన్నతనంలో మరణిస్తారు. దాంతో అన్నావదినలు చాలా గారాబంగా పెంచుతారు. ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలు అంటూ తిరుగుతున్నాడని... తమ్ముడిని ఒక దారిలో పెట్టాలని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళమంటాడు అన్నయ్య. అక్కడ మధుమిత (దిగంగనా సూర్యవన్షి) ను చూస్తాడు. ఆమెకు ఆల్రెడీ అభిరామ్ తెలుసు. అతడు గతంలో చేసిన వెధవ వేషాలు చూస్తుంది. అందుకని, నచ్చడు. ఎప్పుడూ గొడవ పడుతుంటారు. విచిత్రం ఏమిటంటే... నాని, చిన్ని - డేటింగ్ యాప్‌లో ఇద్దరూ ముద్దు పేర్లు, వేర్వేరు ఫొటోలతో ఛాటింగ్ చేసుకుంటారు. ఒరిజినల్ ఫోటోలు, పేర్లు లేకపోవడంతో ఎవరితో ఛాటింగ్ చేస్తున్నదీ తెలియదు. ఒక రోజు కలుద్దామనుకుంటారు. తనతో ఛాటింగ్ చేసే చిన్ని అనుకుని మరొక చిన్ని (మిర్నా మీనన్) కి ప్రపోజ్ చేస్తాడు నాని అలియాస్ అభిరామ్. ఆ సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు పక్కనే ఉంటారు. గొడవలు అవుతాయి. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా నాని ఇంటికి చిన్ని వస్తుంది. పెళ్లికి రెడీ అవుతుంది. తాను ఛాట్ చేసిన చిన్ని, తనతో పెళ్ళికి రెడీ అయిన చిన్ని ఒకరు కాదని నానికి ఎప్పుడు తెలిసింది? తాను ఆఫీసులో గొడవ పడే అభిరామే తనతో ఛాటింగ్ చేసే నాని అని మధుమితకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఏమైంది? నాని ఏం చేశాడు? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ (Crazy Fellow Telugu Movie Review) : జయాపజయాలతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రతిసారీ వినిపించే విమర్శ... ఆది కొత్తగా కనిపించడం లేదని, కొత్తగా ప్రయత్నించడం లేదని! ఆయన నటన రొటీన్‌గా ఉంటుందని కొందరు ప్రేక్షకులూ చెప్పారు! 'క్రేజీ ఫెలో' చూసిన ప్రేక్షకుల నుంచి ఆ మాట వినిపించే అవకాశాలు తక్కువ.
'క్రేజీ ఫెలో' కథ కొత్తగా ఉందని చెప్పలేం! 'గుండెజారి గల్లంతయ్యిందే'కు దగ్గర దగ్గరగా ఉంటుంది. కథలో ఆ పోలికలు కనిపిస్తాయి. అయితే, కథను కామెడీతో మిక్స్ చేసి చెప్పిన విధానం బావుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. కథకు తగినట్టు పాటలు కుదిరాయి. ఫణికృష్ణ రైటింగ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆది సాయి కుమార్‌తో సెటిల్డ్‌గా చేయించారు. కామెడీ విషయంలో కొన్ని సన్నివేశాల్లో ఓవర్ చేసిన తర్వాత... ఓవర్ యాక్షన్ అని డైలాగుల్లో సెల్ఫ్ సెటైర్ వేశారు.
'క్రేజీ ఫెలో' ఫస్టాఫ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. కామెడీ మీద పెట్టిన కాన్సంట్రేషన్ ఎమోషన్స్ మీద పెట్టలేదు. హీరోయిన్లు ఇద్దరి పాత్రల్లో భావోద్వేగాలను చూపించే అవకాశం ఉంది. అయినా అటుగా చూడలేదు. ప్రేమ విషయంలోనూ ఆ కాన్సంట్రేషన్ కొరవడింది. హీరోతో మిర్నా ప్రేమలో పడటానికి గల కారణాన్ని బలంగా చూపించాల్సింది. లవ్, ఎమోషన్స్ పైపైన చూపించడంతో కథ మరీ రొటీన్ అనిపించింది. క్లైమాక్స్ కూడా రొటీన్. ఇంతకు ముందు చూసిన కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి.
ఆది సాయి కుమార్ లుక్ బావుంది. ఆ లుక్ చేంజ్ చేయడం వల్ల నటనలో కూడా డిఫరెన్స్ కనిపించింది. కామెడీ పరంగానూ టైమింగ్ ఈసారి బావుంది. దిగంగనా సూర్యవన్షి పాత్రకు తగినట్టు చేశారు. మిర్నా మీనన్ ఆకట్టుకుంటారు. ఆమె ముఖం రజిషా విజయన్‌లా ఉంది. నర్రా శ్రీనివాస్, ఆది మధ్య సీన్స్‌లో కామెడీ వర్కవుట్ అయ్యింది. సప్తగిరి, 'బస్ స్టాప్' సాయి, టేస్టీ సాయితేజ్ తదితరులను కామెడీ పరంగా సరిగా ఉపయోగించుకోలేదు. అనీష్ కురువిల్లా పాత్రకు తగినట్లు చేశారు. హీరో వదినగా నటించిన వినోదిని వైద్యనాథ్ డబ్బింగ్ మొదట కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే, చివరకు వచ్చే సరికి ఆ డబ్బింగ్ వల్ల కొంత కామెడీ జనరేట్ అయ్యింది.
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : ఆది సాయి కుమార్ గత సినిమాలతో పోలిస్తే... 'క్రేజీ ఫెలో' సినిమా బెటర్‌గా ఉంది. కథ రొటీన్ కానీ సెకండాఫ్‌లో కామెడీ వర్కవుట్ అయ్యింది. వీకెండ్ బోర్ కొట్టి, ఖాళీగా ఉండి... కాసేపు ఎంజాయ్ చేయాలనుకుంటే 'క్రేజీ ఫెలో' గురించి ఒకసారి ఆలోచించండి.