సినిమా రివ్యూ : బాయ్‌ఫ్రెండ్ ఫ‌ర్ హైర్
రేటింగ్ : 2/5
నటీనటులు : విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్, మధునందన్, రాజా రవీంద్ర, హర్షవర్ధన్, శివనారాయణ, 'నెల్లూరు' సుదర్శన్, పూజా రామచంద్రన్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : బాల సరస్వతి
సంగీతం: గోపి సుందర్
నిర్మాతలు : వేణుమాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి
రచన, దర్శకత్వం : సంతోష్ కంభంపాటి
విడుదల తేదీ: అక్టోబర్ 14, 2022


బాయ్‌ఫ్రెండ్ ఫ‌ర్ హైర్ (Boyfriend For Hire Movie)... అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ను తెచ్చుకోవడం! ఇంకా క్లారిటీగా చెప్పాలంటే... డబ్బులు ఇచ్చి అబ్బాయిని తన బాయ్‌ఫ్రెండ్‌గా ఉండమని ఓ అమ్మాయి బుక్ చేసుకోవడం! టైటిల్‌కు తగ్గట్టు వెరైటీగా ప్రచారం చేశారు. మరి, సినిమా ఎలా ఉంది (Boyfriend For Hire Review)? అబ్బాయిని అమ్మాయి బుక్ చేసుకోవడం ఏంటి? 'కేరింత', 'మనమంతా', 'ఓ పిట్టకథ' సినిమాల్లో నటించిన విశ్వంత్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?  


కథ (BoyFriend For Hire Movie Story) : బాల్యంలో ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిలకు దూరంగా ఉంటాడు అర్జున్ (విశ్వంత్). చదువు పూర్తైన తర్వాత ఎదురైన మరో అనుభవంతో జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని అనుకుంటాడు. సరిగ్గా ఆ టైమ్‌లో తల్లిదండ్రులు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తారు. అప్పుడు అమ్మాయిలను అర్థం చేసుకోవడానికి, తనకు సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ (Boyfriend For Hire) గా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఆ క్రమంలో అతడికి దివ్య (మాళవికా సతీషన్) పరిచయం అవుతుంది. ఆమె ఎవరు? తాను కోరుకున్న లక్షణాలు ఆమెలో ఉన్నాయని పెళ్ళికి సిద్ధపడిన అర్జున్, ఆ తర్వాత ఆమెను ఎందుకు దూరం పెట్టాడు? అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌గా వెళ్లడం అలవాటు చేసుకున్న అతడు, జీవితంలో నేర్చుకున్న పాఠం ఏమిటి? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ (BoyFriend For Hire Telugu Movie Review) : అమ్మాయిల సంఖ్య తక్కువ కావడంతో వాళ్ళ వెనుక అబ్బాయిలు పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో... పార్ట్‌న‌ర్‌, రిలేషన్షిప్స్ కోసం టిండర్ లాంటి డేటింగ్ యాప్స్‌ను యువత ఫాలో అవుతున్న ఈ కాలంలో... 'బాయ్‌ఫ్రెండ్‌ ఫర్ హైర్' కాన్సెప్ట్ వింటే కొంచెం కొత్తగా ఉందని చెప్పాలి. టైటిలే సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చింది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఆ క్యూరియాసిటీ కరిగిపోవడానికి, ఇదొక కామన్ రొటీన్ డ్రామా అని థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు.
 
'బాయ్‌ఫ్రెండ్‌ ఫర్ హైర్' టైటిల్‌లో, ఐడియాలో ఉన్న కొత్తదనం సినిమాలు అసలు లేదు. అదేంటో? ఒక అమ్మాయి అద్దెకు బాయ్ ఫ్రెండ్ అని పోస్ట్ చేయగానే... చాలా మంది అమ్మాయిలు అబ్బాయికి ఫోనులు చేయడం స్టార్ట్ చేస్తారు. తమ సమస్యలు విన్నవించుకుని పరిష్కరించమని కోరతారు. ఆ సమస్యలు అన్నీ ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో చూసేసినవే. 


అత్తయ్య ఫ్యామిలీతో ఉన్న గొడవల కారణంగా బావతో పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని, నువ్వు వచ్చి బ్యాడ్ బాయ్‌ఫ్రెండ్‌గా యాక్ట్ చేస్తే బావకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఓ అమ్మాయి అడుగుతుంది. హీరో సరేనని అమ్మాయి వాళ్ళింటికి వెళతాడు. ఆమె చెప్పినట్టు చేస్తాడు. అమ్మాయి తల్లికి  హీరో వాలకం, వ్యవహారం నచ్చదు. గొడవలు పక్కన పెట్టి ఆడపడుచుకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. మాజీ బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకోవడానికి మరో అమ్మాయి హీరో తన బాయ్ ఫ్రెండ్ అని చెబుతుంది. అక్కడ హీరో చెప్పిన నీతి బోధనలు విని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చిన మాజీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్‌ మాత్రమే. ఇటువంటి సన్నివేశాలు సినిమాలో కోకొల్లలు. అటువంటి సన్నివేశాలు పక్కన పెడితే... హీరోయిన్‌ను చూసి హీరో ఎందుకు ప్రేమలో పడతాడు? అనే దానికి లాజిక్ లేదు. పోనీ, అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నా... తనకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటాడో, ఆ లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయని తెలుసుకునే ప్రాసెస్, తన తప్పు గ్రహించి హీరోయిన్‌కు దగ్గరయ్యే సన్నివేశాలు కూడా కన్వీన్సింగ్‌గా లేదు. అంతా రొటీన్! అందువల్ల, సినిమాలోని సోల్‌తో కనెక్ట్ కావడం కష్టం.


థియేటర్లలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మధ్య గోపి సుందర్ సంగీతం కాస్త రిలీఫ్ ఇచ్చింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి.  గోపి సుందర్ బెస్ట్ ఆల్బమ్ అని చెప్పలేం గానీ... ఈ కథ, సన్నివేశాలకు మంచి పాటలు ఇచ్చినట్టే. పాటలను తెరకెక్కించిన విధానం బావుంది. సినిమాటోగ్రఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. పాటలతో పాటు క్లైమాక్స్ కొంత రిలీఫ్ ఇస్తుంది. సుదర్శన్ నవ్వించారు. రైటింగ్ పరంగా చూస్తే... అక్కడ కామెడీ వర్కవుట్ అయ్యింది.


ఈతరం అబ్బాయిగా హీరో విశ్వంత్ చక్కగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు. కాకపోతే... రొటీన్ సీన్స్ వల్ల కొన్ని చోట్ల ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. మాళవికా సతీషన్ కూడా అంతే! ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మన్స్ బావుంది. కానీ, మోడ్రన్ అమ్మాయిగా సూట్ కానట్టు కనిపిస్తుంది. రాజా రవీంద్ర, మధునందన్, హర్షవర్ధన్, శివన్నారాయణ తదితరులు రొటీన్ సీన్స్‌లో రొటీన్‌గా చేశారు. 


Also Read : 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?


ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' టైటిల్, కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉన్నాయో... సినిమాలో సన్నివేశాలు అంత పాతగా ఉన్నాయి. తమకు ఎటువంటి జీవిత భాగస్వామి కావాలో నిర్ణయించుకోలేక డైలమాలో ఉన్న యువత ఉన్నారు. ఆ పాయింట్ తీసుకున్నారు దర్శకుడు సంతోష్. మంచి విషయం ఉన్న కాన్సెప్ట్ అయితే ఎంపిక చేసుకున్నారు గానీ... దాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించలేకపోయారు. గోపి సుందర్ పాటలు, సుదర్శన్ కామెడీ కొంత రిలీఫ్ ఇస్తాయంతే! 


Also Read : ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ