70 years For Devadasu: "భారతీయ సినీ ప్రపంచంలో  దేవదాసు అంటే  అక్కినేని నాగేశ్వర రావు ఒక్కడే ." ఈ మాట అన్నది వేరే ఎవరో కాదు . లెజెండ్రీ నటుడు గా చరిత్రలో నిలిచిపోయిన దిలీప్ కుమార్ . 1955 లో ఆయన నటించిన దేవదాస్ (హిందీ ) సినిమా సూపర్ హిట్ అయి అందరూ తన దిలీప్ నటనను పొగుడుతున్నప్పుడు ఆయన అన్న మాటలు అవి . అంతకు రెండేళ్ల ముందు 1953లో వచ్చిన తెలుగు దేవదాసు లో అక్కినేని నటన ను తాను అందుకోలేక పోయానని పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు దిలీప్ . అంతలా దేవదాసుగా ముద్ర వేశారు మన అక్కినేని .ఈ సినిమా వచ్చి నేటికి సరిగ్గా 70 ఏళ్ళు అయింది. ఇప్పటికీ దేవదాసు అంటే అక్కినేని ,పార్వతి అంటే సావిత్రి గుర్తు రావాల్సిందే . ఈ సినిమా అంతలా వాళ్ళ కెరీర్ ను పీక్ కు తీసుకెళ్లింది . అప్పటికే అక్కినేని బాలరాజు ,కీలుగుఱ్ఱం లాంటి హిట్ సినిమాల్లో నటించినా సూపర్ స్టార్ స్టేటస్ మాత్రం దేవదాసు తోనే  వచ్చింది . అలాగే సావిత్రి కి కూడా ఈ సినిమా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వేదాంతం రాఘవయ్య వహించారు . నిర్మాతగా డీఎల్ నారాయణ వ్యవహరించారు . 

 

ట్రాజెడీ కింగ్ అండ్ క్వీన్ :

 

ఈ సినిమా ANR ,సావిత్రిలకు ఎలాంటి ఇమేజ్ ఇచ్చింది అంటే వాళ్ళ తరువాతి సినిమాల్లో చాలావరకూ ట్రాజెడీ లుగానే ఉండేవి . ఒకానొకదశలో అవంటే విసుగెత్తి పోయి అక్కినేని కావాలనే మిస్సమ్మ (1955) సినిమాలో చిన్నదైనా సరే కామెడీ పాత్ర ను చేసారు . అయిప్పటికీ ఆ తరువాత కూడా అనేక ట్రాజెడీ ఎండింగ్ ఉన్న సినిమాలను ఆయన చెయ్యాల్సి వచ్చింది . 

 

మూలం -శరత్ చంద్ర రాసిన నవల :

 

బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ (1876-1938) ఆనాటి సమాజం లోని అనేక అంశాలను ,మధ్యతరగతి జీవితాలను నవలలు గా మలుస్తూ దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు . ఆయన రాసిన నవలల ఆధారంగా 44 సినిమాలు వివిధ భాషల్లో రూపొందాయి . వాటిలో ముఖ్యమైనది దేవదాస్ . ఈ నవలను ఆయన 1917 లో మొదటిసారి పబ్లిష్ చేసారు . ఈ నవల  ఎంతెలా జనం  లోకి చొచ్చుకుపోయింది అంటే పురాణాలు ,చరిత్రలు కాకుండా భారతీయ భాషల్లో అత్యధికసార్లు సినిమాగా తీయబడ్డ కథగా రికార్డ్ సృష్టించింది . మొదటసారి గా 1928 లోనే సైలెంట్ సినిమాగా నరేష్ మిత్ర దర్శకత్వం లో రూపొందింది . తరువాత బెంగాలీ (1935 ),హిందుస్తానీ (1936 ) , అస్సామీ (1937) భాషల్లో పీసీ బారువా దర్శకత్వంలో తీశారు.     తరువాత దీనిని తెలుగు ,తమిళ భాషల్లో 1953లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని ,సావిత్రిలతో  నిర్మించారు . ఆ తరువాత హిందీ లో 1955 లో దిలీప్ కుమార్ హీరోగా బిమల్ రాయ్ దర్శకత్వంలో మళ్ళీ రీమేక్ చేసారు . ఆ తరువాత కూడా  అనేక సార్లు ,వివిధ భాషల్లో దేవదాస్ ను రీమేక్ చేస్తూనే వస్తున్నారు . 

 

కథాంశం ఇదే :

 

దేవదాసు సినిమా కథ అందరికీ తెలిసిందే. రావులపల్లె  జమీందారీ కుటుంబానికి చెందిన దేవదాసు ,వాళ్ళ పొరుగింటి పేదవాడైన నీలకంఠం కుమార్తె సావిత్రి చిన్ననాటి నుండే స్నేహితులు. చదువుకోసం పట్నం వెళ్లి పెద్దవాడై తిరిగివచ్చిన దేవదాసు ,సావిత్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు .  సావిత్రి కుటుంబీకులు ఈ పెళ్లి గురించి దేవదాసు పెద్దలను అడగగా వాళ్ళు ఒప్పుకోరు . పైగా సావిత్రి కుటుంబం పేదరికాన్ని గురించి హేళన చేస్తారు. ఆకోపం తో సావిత్రి తండ్రి నీలకంఠం సావిత్రిని కూడా డబ్బున్న జమీందారిణి ని చేస్తా అంటూ ప్రతిజ్ఞ చేసి,భార్యపోయి  పిల్లలున్న దుర్గాపురం ముసలి జమీందారుతో పెళ్లి నిశ్చయం చేస్తాడు. దానితో తనను పెళ్లి చేసుకోమని రహస్యంగా కలిసిన సావిత్రి ని వెనక్కు పంపించివేసి ,సిటీకి వెళ్ళిపోతాడు దేవదాసు.  ఇంట్లో పెద్దలకు  ఎదురు తిరిగలేనని  సావిత్రికి లెటర్ రాయడంతో చేసేది లేక ఆమె ముసలి జమీందారును పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆమెను మరిచిపోలేక త్రాగుడు కు బానిసైన దేవదాసును చంద్రముఖి అనే వేశ్య చేరదీసి ఆదరిస్తుంది. అప్పటికీ మందును మానలేని తాను ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ,చివరిసారిగా సావిత్రిని చూడడానికి దుర్గాపురం వెళ్లి ఆమె ఇంటి ముందే చనిపోతాడు. దేవదాసు అనే పేరు విని చూడడానికి పరుగెత్తి వస్తున్న సావిత్రిని ఇంటిగడప దాటడానికి వీలులేదంటూ జమీందారు ,అయన పిల్లలు తలుపులు మూసెయ్యడంతో ఆమె ఆ తలుపులకు గుద్దుకుని పడిపోవడంతో కథ ముగుస్తుంది . 

 

నిజజీవిత కథే -దేవదాసు కు మూలం :

 

దేవదాస్ నవల రాసినప్పుడు చాలామంది  ఇది శరత్ జీవితంలోనివో ,లేక వేరే వ్యక్తి జీవితం లోని సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఉంటాడని,దేవదాస్ అనే వ్యక్తి నిజంగానే ఎక్కడో ఉండేఉండొచ్చని ఊహాగానాలు చేసారు . అయితే శరత్ మాత్రం తాను నిజజీవిత పాత్ర నుండే స్ఫూర్తి పొందానని ,అయితే అది దేవదాస్ కాదు సావిత్రి అని చెప్పి షాక్ ఇచ్చారు . బెంగాల్ లోని హతిపోత గ్రామానికి చెందిన జమీందార్ భువన్ మోహన్ చౌదరి రెండవ భార్య జీవితం లోని ఘటనల ఆధారంగా దేవదాస్ రాసారని ప్రచారం లో ఉంది . 

 

తెలుగు -తమిళ భాషల్లో ఒకేసారి నిర్మాణం :

 

ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు . అయితే తెలుగులో దేవదాసు అనీ ,తమిళ్ లో దేవదాస్ అనీ పేరు పెట్టారు . రెండు భాషల్లోనూ అక్కినేని ,సావిత్రి లే నటించగా చంద్రముఖి గా మలయాళ నటి లలిత నటించారు . తెలుగు ,తమిళ్ రెండు వెర్షన్స్ కూ  వేదాంతం రాఘవయ్య గారే దర్శకత్వం వహించారు . రెండు భాషలకూ సి.ఆర్. సుబ్బురామన్ సంగీత దర్శకత్వం వహించగా పాటలన్నీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి . "ఓ ... దేవదా  " "పల్లెకు పోదాం .. పారును చూద్దాం " కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ " "జగమే మాయ "  " అంతా  భ్రాంతి యేనా " " అందం చూడవయా "ఇలా ప్రతీ పాట  ఇప్పటికీ తెలుగువాళ్ళ మనస్సులో నిలిచిపోయాయి . ఇక ఈ సినిమా తెలుగులో 1953 జూన్ 26 న విడుదల కాగా తమిళ్ లో మాత్రం మూడు నెలల తరువాత 11 సెప్టెంబర్ 1953 న రిలీజ్ అయింది . రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి . 

 

సావిత్రికి మొదటి చాయిస్ సావిత్రి కాదు :

 

సావిత్రి పాత్ర కు ముందు షావుకారు జానకి ని ఎంచుకున్నారు నిర్మాతలు . అయితే ఒక వారం షూటింగ్ అయ్యాక ఈ సినిమా తెలుగులో ఆడదాని చెప్పి నిర్మాతలు షూటింగ్ ఆపేసి శాంతి అనే వేరే సినిమా తీశారు . అది కాస్తా ప్లాప్ కావడంతో డీఎల్ నారాయణ దీనిని సొంతంగా నిర్మించారు . అప్పుడు షావుకారు జానకి పాత్రలోకి సావిత్రి వచ్చి చేరింది . అలాగే సినిమా చివర్లో చాలామంది  సావిత్రి చనిపోతుంది అనుకుంటారు ,,కానీ పడిపోతుంది అంతే . 

 

నటన కు క్రొత్త భాష్యం చెప్పిన ANR :

 

చాలామంది ఇప్పటికీ అక్కినేని ఈ సినిమాలో తాగుబోతుగా కనపడడానికి ఉపవాసాలు చేసి నటించాడు అనుకుంటారు గానీ అది అబద్దం . తనకు పెరుగన్నం తింటే నిద్ర వస్తుందని అందుకని ,రాత్రిపూట పెరుగు తిని ,నిద్ర వస్తున్న సమయంలో షూటింగ్ జరిపామని అందుకే కళ్ళు మూతలు పడిపోతూ తాగుబోతు లా స్క్రీన్ పై కనపడ్డానని అక్కినేని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు . అలాగే నటన అంటే ఆకలితో ఉన్న పాత్ర చెయ్యాలంటే కడుపు మాడ్చుకుని షూటింగ్ చేస్తే అది నటన అవ్వదనీ ,కేవలం కమిట్మెంట్ మాత్రమే అవుతుందని అనేవారు . కడుపునిండా తిని ఏమీ తినని వాడిలా కనపడడం కదా నటన అంటే అనేవారు అక్కినేని . 

 

ఒక రీమేక్ -ఒక సీక్వెల్ -రెండూ ప్లాప్ లే :

 

దేవదాసు సినిమాను 21 ఏళ్ల  తర్వాత 1974 లో విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా దేవదాసు సినిమాను మళ్ళీ తెలుగులో రీమేక్ చేసారు .ఇందులో సావిత్రిగా విజయ నిర్మల ,చంద్రముఖిగా జయంతి నటించారు .  ఆనాటి  ఖర్చుల రీత్యా దానికి చాలా బడ్జెట్ కూడా పెట్టారు . అయితే సినిమా మాత్రం పాత దేవదాసు స్థాయిని అందుకోలేక పోయింది . అలాగే ,1978 లో దాసరి నారాయణ రావు దేవదాసు ను పునర్జన్మ కథగా మారుస్తూ ,దేవదాసు ,చంద్రముఖి లు మళ్ళీ జన్మించినట్టు కథను కొనసాగిస్తూ "దేవదాసు మళ్లీ పుట్టాడు " అనే సినిమాను ప్రయోగాత్మకంగా తీశారు . ఇందులో దేవదాసు పాత్రలో మళ్ళీ అక్కినేని ,చంద్రముఖి పాత్రలో వాణిశ్రీ నటించగా సావిత్రి పాత్రలో సావిత్రినే  నటింపజేశారు. ఈ సినిమా కూడా  పెద్దగా ఆడలేదు . కారణం ఒకటే .. దిలీప్ కుమార్ చెప్పినట్టు సినీ చరిత్రలో  దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వర రావు ఒక్కడే..!