Uttarakhand Election Result 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఉత్తర్‌ప్రదేశ్ సహా గోవా, మణిపుర్‌లో తిరిగి అధికారం కాపాడుకుంది. అంతేకాకుండా ఉత్తరాఖండ్‌లో చరిత్రను తిరగరాసి అనూహ్యంగా మళ్లీ విజయబావుటా ఎగురవేసింది. అయితే సీఎం పుష్కర్ సింగ్ ధామి మాత్రం పార్టీని నెగ్గించి తాను ఓడిపోయారు.


రికార్డ్ బద్దలు


వరుసగా రెండోసారి అధికారం చేపట్టి కాషాయ పార్టీ చరిత్రను తిరగరాసింది. రాష్ట్రం ఎర్పాటైనప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లో ఒకేపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ దేవభూమిలో కాషాయ జెండాను రెపరెపలాడించారు భాజపా నేతలు. ఇప్పటికే మెజారిటీ మార్క్ (36)ను భాజపా దాటేసి స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది.


సీఎంల మార్పు


ఉత్తరాఖండ్‌లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే భాజపా ముగ్గురు సీఎంలను మార్చింది. అధికార పార్టీలో ఈ అస్థిరత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావించింది.. కానీ సీఎం పుష్కర్ సింగ్.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తాను ఓడినా పార్టీని గెలిపించారు.


అతి చిన్న వయసులో ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధామీ.. పార్టీని విజయతీరాలకు చేర్చారు. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ఉత్తరాఖండ్‌లో మళ్లీ రిపీట్ అయింది.


ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎంలెవరూ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలే లేవు. ఇప్పుడు ధామీ కూడా అలానే తన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి చేతిలో ఓటమిపాలయ్యారు.


మోదీ ఛరిష్మా


ఎన్నికల్లో ధామీ పనితనంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా కూడా బాగా పనిచేసింది. ఎన్నికల సమయంలో ఉత్తరాఖండ్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ప్రతిసభలోనూ కాంగ్రెస్‌పై తనదైన శైలిలో వాగ్బాణాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఇలా మోదీతో పాటు భాజపా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా వంటి హేమాహేమీలు ప్రచారంలో దుమ్మురేపారు. పుష్ప సినిమా డైలాగ్‌లు కూడా ప్రచారంలో బాగా పేలాయి. మొత్తానికి గత చరిత్రను తిరగరాస్తూ భాజపా మరోసారి దేవభూమిలో అధికారం దక్కించుకుంది.


Also Read: UP Election Result 2022: యూపీని ఊపేసిన యోగి మేనియా- అయ్యగారి తర్వాత ఆయనే- 2024లో ప్రధాని అభ్యర్థిగా!


Also Read: Bhagwant Mann Profile: స్టాండప్ కమెడియన్ నుంచి సీఎంగా స్టాండింగ్ వరకూ ! పంజాబ్ హీరో భగవంత్ మన్ !