పంజాబ్ ప్రజలు వినూత్నమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రులుగా చేసిన వారందర్నీ ఓడించారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అందర్నీ ఇంటికి పంపేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ నేత ఒక్క భగవంత్ మన్‌ను మత్రమే గెలిపించారు. ఈ ట్రెండ్ పంజాబ్ రాజకీయాల్లో కొత్తదని అనుకోవచ్చు. 


రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ 


పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ ముందు  జాగ్రత్తగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. చామకూర్ సాహిబ్, బహదూర్  అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఇందులో ఆయన చామకూర్ సాహిబ్ ఆయన సిట్టింగ్ స్థానం 2007 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. హ్యాట్రిక్ సాధించారు. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనకు ఈ క్రేజ్ సరిపోలేదు. హ్యాట్రిక్ సాధించిన స్థానం నుంచి చన్నీ ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ చరణ్ జీత్ పేరుతో నిలబెట్టిన అభ్యర్థి చేతిలో చన్నీ ఓడిపోయారు. పోటీలో నిలబడిన మరో స్థానం బహదూర్  లోనూ ఘోరపరాజయం తప్పలేదు. అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లాభ్ సింగ్ చేతిలో భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. 


ఓడిపోయిన కప్టెన్ అమరీందర్ సింగ్ !


ఇక నిన్నామొన్నటిదాకా పంజాబ్ సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ను కూడా ప్రజలు ఇంటికే పంపారు. ఆయనకు పెట్టని కంచుకోటలాంటి పటియాలా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2002 నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అమరీందర్ అక్కడ గెలుస్తూ వస్తున్నారు. 2014లో ఆయన భార్య విజయం సాధించారు. ఇప్పుడు ఆ స్థానంలో తాను కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.


ప్రకాష్ సింగ్ బాదల్ ఓటమి !


ఇక మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కూడా తన కంచుకోట నియోజకవర్గం లంబీ నుంచి పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేత చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన 1997 నుంచి లంబీ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన పరాజయం పాలయ్యారు . ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధించింది. 


మాజీ మహిళా ముఖ్యమంత్రి రాజిందర్ కౌర్ భట్టాల్ కూడా ఓటమి !


ఇక పంజాబ్‌కు కొన్నాళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మహిళా నేత రాజిందర్ కౌర్ భట్టాల్ కూడా లెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత బరిందర్ కుమార్ గోయల్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం భట్టాల్‌కు కంచుకోట లాంటిదే. 1992 నుంచి 2017 వరకూ ఆ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సునామీలో ఓటమి చవి చూడక తప్పలేదు.