పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అక్కడ ఆప్ గెలిస్తే సీఎం ఎవరు అవుతారో కేజ్రీవాల్ ముందుగానే ప్రకటించారు. ఆయనే భగవంత్ మన్. ఆయన రాజకీయ పయనం ఆసక్తికరం. రాజకీయ పరిస్థితుల్ని కామెడీగా ప్రజల ముందు ఉంచే స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. రాజకీయాల్లో ఎదిగిన నేత భగవంత్ మన్. ఆయనపై విశేషాలే కాదు.. వివాదాలు కూడా ఉన్నాయి. 





స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన భగవంత్ మన్ ! 


భగవంత్ మన్  ఓ కాలేజ్ డ్రాపవుట్, పంజాబ్ లో క్రేజ్ ఉన్న స్టాండప్ కమెడియన్, కేజ్రీ వాల్ సభలకు జనాలను ఆకర్షించగలిగే క్రౌడ్ పుల్లర్ ....భగవంత్ మాన్ ప్రొఫైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 1973లో సంగ్రూర్ జిల్లా సతోజ్ విలేజ్ లో ఓ జాట్ సిఖ్ కుటుంబంలో జన్మించారు మాన్. షహీద్ ఉద్దమ్ సింగ్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. కాలేజ్ లో ఉన్నప్పుడే కామెడీ ఫెస్టివల్స్ పార్టిసిపేట్ చేయటం మొదలు పెట్టాడు. పంజాబ్ యూనివర్సిటీ పోటీల్లో రెండు బంగారు పతకాలు గెలిచి తన కాలేజ్ పేరును మారుమోగించాడు. స్టాండప్స్ లో మాన్ మెయిన్ సబ్జెక్ట్ పాలిటిక్స్. సెటైరికల్, ఫన్నీగా తన దృష్టి కోణంలో రాజకీయాలను భగవంత్ మాన్ విశ్లేషించే తీరుకే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. జగతార్ జగ్గీ, రాణారణ్ బీర్ లాంటి సహచరులతోకలిసి కెనడా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లోనూ స్టాండప్ షోలను నిర్వహించారు మాన్. 2008లో గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్ లో పాల్గొనటం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేన్ మా పంజాబ్ దే లాంటి 13 సినిమాల్లో నటించటం అతని ఫ్యాన్ బేస్ ను విపరీతంగా పెంచింది.


మొదట పీపుల్స్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ! 



2011 లో మన్ ప్రీత్ సింగ్ బాదల్ పీపుల్స్ పార్టీ తో రాజకీయాల్లోకి వచ్చిన మాన్ కు స్టార్టింగ్ లో అన్నీ ఎదురుదెబ్బలే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు కూడా. 2014లో ఆప్ లో చేరాలని అతను తీసుకున్న డెసిషన్ మాన్ పొలిటికల్ కెరీర్ ను ప్రభావితం చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో సొంత జిల్లా సంగ్రూర్ ఎంపీగా రెండు లక్షలకు పైగా మెజారీటీ తో గెలిచి పార్లమెంట్ కు వెళ్లారు మాన్. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 2017 లో శిరోమణి అకాళీదళ్ అగ్రనేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పైనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో మరోసారి ఎంపీగా పోటీ చేసిన మాన్ విజయం సాధించి....రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


విశేషాలే కాదు.. వివాదాలెన్నో !


భగవంత్ మన్ ఇప్పుడు పంజాబ్ సీఎం కాబోతున్నారు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు.. కానీ ఆయనపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. అందులో ఒకటి మద్యానికి బానిస. ఆయన ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. పార్లమెంట్‌కు మద్యం తాగి వచ్చారని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. ఓ సారి పార్లమెంట్ ప్రోసీడింగ్స్‌ను తన ఫోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. తన మద్యం అలవాటుపై తీవ్రమైన విమర్శలు రావడంతో.. మద్యాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నట్లు 2019లో ప్రకటించి...తన వ్యసనాలపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు భగంవత్ సింగ్ మాన్.


సామాజిక సేవ కూడా భగవంత్ మన్ ప్రత్యేకత ! 



లోక్ లెహర్ ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్జీవో ను స్థాపించి పంజాబ్ లో భూగర్భ జలాల కాలుష్యం తో వికలాంగులుగా మారిన వారిని ఆదుకుంటూ తన పెద్దమనసును చాటుకున్నాడు. అలా ఓ హాస్యనటుడిగా మొదలైన మాన్ ప్రస్థానం...కేజ్రీవాల్ మద్దతు...పంజాబ్ ప్రజల ఆదరణతో సీఎం పీఠానికి చేరువ చేసింది.



అపోహల్ని తొలగించి సీఎం పీఠం వద్దకు చేరిక !


ఓ కామెడీ చేసే వ్యక్తి ప్రజలను ఆకర్షించగలడా...ఎప్పుడూ సైటెర్లు వేసే ఆ పర్సన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోగలరా...అన్న అనుమానాల్ని పటా పంచలు చేసి.. భగవంత్ మన్ అనుకున్నది సాధించారు.  మోదీ క్రేజ్ విపరీతంగా ఉన్న టైంలోనే....కేజ్రీవాల్ చీపురు పట్టి ఢిల్లీని ఊడ్చి పారేశారు. లాస్ట్ ఎలక్షన్స్ లో పంజాబ్ లోనూ ప్రభావం చూపించి ప్రతిపక్షాన్ని కైవసం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి తరపున దళపతిగా నిలబడిన భగవంత్ మాన్ ను పంజాబ్ ప్రజలు ఇప్పుడు గుండెల్లో పెట్టుకున్నారు. 48 సంవత్సరాల వయస్సు గల భగవంత్ మాన్ సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడే...అతడే తమ సీఎం అభ్యర్థిని కేజ్రీవాల్ ప్రకటించారు. అదేం కేజ్రీ ఓన్ డెసిషన్ కూడా కాదు. సీఎం అభ్యర్థి ఎవరని టెలిఫోన్ సర్వే చేపడితే 93 శాతం ఆప్ కార్యకర్తలు ఏకగీవ్రంగా ఓటేసిన  నాయకుడు భగవంత్ మాన్.


ఇప్పుడు ఆయన పంజాబ్‌ను లీడ్ చేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్ భగవంత్ మన్  !