Punjab Election Result 2022: ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపుర్, గోవా.. ఇలా నాలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. కానీ మరోవైపు కాంగ్రెస్ మాత్రం.. అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఘోరంగా ఓడిపోయింది. అసలు దీనికి కారణమేంటి? తాను ఓడి, పార్టీని ఓడించిన ఆ ముగ్గురు మహామహులు ఎవరో చూద్దాం.


ముగ్గురు ముగ్గురే!


మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ.. ముగ్గురూ కలిసి కాంగ్రెస్‌ను నడిపించాల్సింది పోయి కలిసి ఓడించారు. పార్టీలో అంతర్గత కలహాలతో విసిగిపోయి సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకుని అమరీందర్ సింగ్.. కాంగ్రెస్‌ను దెబ్బతీశారు. సిద్ధూ, చన్నీల మధ్య మొదలైన అంతర్యుద్ధం.. కాంగ్రెస్‌ను ఎన్నికల్లో ముంచేసింది. అయితే ఈ ముగ్గురూ కాంగ్రెస్‌ను ముంచి తాము కూడా మునిగిపోయారు. సిద్ధూ, చన్నీ, అమరీందర్ సింగ్.. ముగ్గురూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.


ఇదే కారణం


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ గెలవడానికి ప్రజలతో పాటు కాంగ్రెస్ కూడా కృషి చేసిందనడంలో సందేహమే లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను విపక్షాల కంటే అంతర్గత కలహాలు, అసమ్మతులే దెబ్బతీశాయి. సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ శిబిరాల మధ్య విభేదాలే ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది.


అమరీందర్ సింగ్ కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పిన తర్వాత సీఎం కుర్చీ తనకు వస్తుందని సిద్ధూ భావించారు. అయితే, చన్నీని కాంగ్రెస్‌ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అధిష్ఠానం నిర్ణయాన్ని సమ్మతించినట్లు సిద్ధూ ప్రకటించినా.. తనకు సీఎం పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే సిద్ధూ అసమ్మతి వ్యాఖ్యలు చేశారు. సీఎంను గద్దె దించే సత్తా తనకు ఉందని హెచ్చరించారు. అయితే చన్నీని సిద్ధూ ఓడించారో లేదో చెప్పలేం కానీ.. ఇదర్నీ ప్రజలు మాత్రం ఇంటికి పంపించారు.


మరోవైపు వేరు కుంపటి పెట్టుకున్న అమరీందర్ సింగ్.. కాంగ్రెస్‌ను ఓడించాలనే కసితో పనిచేశారు. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి పరోక్షంగా ఆమ్‌ఆద్మీకి మేలు చేశారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్‌ను ఓడించారు.. కానీ కెప్టెన్ కూడా ఓడిపోయారు!


ఉత్తరాఖండ్‌


ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ బలంగా చెప్పాయి. అయితే అక్కడ కూడా కాంగ్రెస్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. అధికార భాజపా స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే భాజపాకు మాత్రం ఓ షాక్ తగిలింది. పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమిపాలయ్యారు. కానీ ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి భాజపా అధికారంలోకి వచ్చింది.