పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ 'హెలికాప్టర్' పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. ఈరోజు పంజాబ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014లో తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కోసం తన హెలికాప్టర్‌ను వెళ్లకుండా ఆపేశారని మోదీ ఆరోపించారు.
మరోవైపు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ప్రధాని మోదీపై ఈరోజు ఇలాంటి ఆరోపణలే చేశారు. మరి ఈ విమర్శలు ఏంటో చూద్దాం.
మోదీ ఏమన్నారంటే
2014 ఎన్నికల సమయంలో నేను గుజరాత్ సీఎంగా ఉన్నాను. అప్పుడు నన్ను భాజపా ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. దీంతో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. ఆ సమయంలో ఒకసారి నేను పఠాన్‌కోట్ నుంచి హెలికాప్టర్‌లో హిమాచల్‌ప్రదేశ్ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) కేవలం ఒక ఎంపీ. ఆయనకు కూడా అదే రోజు పంజాబ్ అమృత్‌సర్‌లో ఏదో కార్యక్రమం ఉంది. అప్పుడు నా హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ.. పంజాబ్‌లో వేరే ప్రదేశానికి హెలికాప్టర్‌లో వెళ్తున్నారని నాకు అనుమతి ఇవ్వలేదు. ఓ కుటంబం కోసం కాంగ్రెస్ ఆ నాడు అధికారాన్ని దుర్వినియోగం చేసింది. - ప్రధాని నరేంద్ర మోదీ
చన్నీ విమర్శలు
మరోవైపు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణం కారణంగా తన హెలికాప్టర్‌ను ఆపేశారని విమర్శించారు.
ప్రధాని మోదీ.. నేడు జలంధర్ వెళ్తున్నారనే కారణంగా నా హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అనుమతివ్వలేదు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. దీని వల్ల హోషియార్‌పుర్‌లో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు నేను వెళ్లలేకపోయాను. - చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం
Also Read: UP Election 2022: 'కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి వాళ్లిద్దరూ చాలు- మేం ఏం చెయ్యక్కర్లేదు'
Also Read: UP Election 2022: 'ఆ పాలకులు యూపీని కొల్లగొట్టారు- అందుకే ప్రజలు వెళ్లగొట్టారు'