ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. కాన్పుర్‌లో జరిగిన బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. తొలి విడత పోలింగ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని మోదీ అన్నారు.
పరివార్‌వాదీ (సమాజ్‌వాదీ) ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి ఓటమిపాలు కానుంది. యూపీలో మార్చి 10నే హోలీ జరుపుకుంటారు. ప్రతి ఎన్నికలకు పొత్తులు పెట్టుకునే పార్టీలనే మార్చసేవారు ప్రజలకు ఏం సేవ చేస్తారు. గత ప్రభుత్వాలు యూపీని కొల్లగొట్టాయి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాన్పుర్ సహా మిగిలిన ప్రాంతాల్లో మాఫియా రాజ్యమేలేది. కానీ ఇప్పుడు మాఫియా కొన ఊపిరితో ఉంది. కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ వీళ్లకు అధికారం ఇవ్వకూడదు. భాజపా పాలనలో ముస్లిం యువతులు ధైర్యంగా, భద్రంగా ఉన్నారు. మా పాలనలో ఎక్కువమంది ముస్లిం బాలికలు, యువతులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. - ప్రధాని నరేంద్ర మోదీ
మాఫియా విమర్శలు
సమాజ్‌వాదీ పార్టీపై భాజపా నేతలంతా 'మాఫియా' పేరుతో విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా యూపీ ప్రచార సభల్లో ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు.
" 2017కు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం కలిగేది. మేరట్, బులంద్‌షెహర్ వంటి జిల్లాల్లో అమ్మాయిలు బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వారు ఎంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాల పాలనలో.. లూఠీలు చేసేవారు, గూండాలదే రాజ్యం. వాళ్ల మాటలే ప్రభుత్వ ఆదేశాలుగా భావించేవారు. ఓవైపు మేం ఉత్తర్‌ప్రదేశ్‌లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొంతమంది ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీకారమే వారి ధ్యేయం. "
-ప్రధాని నరేంద్ర మోదీ
7 విడతల్లో
403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగగా, ఫిబ్రవరి 14న రెండో విడత జరుగుతోంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Also Read: Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 34,113 మందికి వైరస్