Assembly Polls 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా సోమవారం కీలకమైన ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటితో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించింది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒక్క విడతలోనే పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.






దేవభూమిలో


ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాల్లో 70 నియోజకవర్గాలకు ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 82,38,187 లక్షల మంది ఓటర్లు 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 


ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని భాజపా యోచిస్తోంది. మరోవైపు సీనియర్ నేత హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్.. అధికారం తమదేనని ధీమాగా ఉంది. ఆమ్‌ఆద్మీ కూడా ఈసారి ఉత్తరాఖండ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.


గోవాలో


గోవాలో మొత్తం 40 నియోజకవర్గాలకు సోమవారం ఒక్క విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 301 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎలాగైనా మరోసారి పీఠం దక్కించుకోవాలని యోచిస్తోంది.


మరోవైపు కాంగ్రెస్ ఈసారి గోవాను వదులుకోకూడదని నిర్ణయించుకుంది. ఇక బంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎమ్‌సీ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ కూడా ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. శివసేన-ఎన్‌సీపీ కూటమి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.


యూపీ రెండో విడత


ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 7 విడతల్లో యూపీ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.


రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మొత్తం 55 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అధికారంలో చేపట్టాలంటే ఈ నియోజకవర్గాల్లో పైచేయి సాధించడం పార్టీలకు కీలకంగా మారింది.


Also Read: Defence Budget 2022: డిఫెన్స్‌ సెక్టార్లో ఉద్యోగాల జాతరే! బడ్జెట్‌లో కేటాయింపుల పరిశ్రమ సంతోషం


Also Read: Karnataka Hijab Row: పాఠశాలల వద్ద 144 సెక్షన్- సోమవారం నుంచి స్కూల్స్ రీఓపెన్