దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌పై ఈరోజు విడుదలయ్యారు. ఈ కేసులో ఫిబ్రవరి 10న అల్‌హాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.







గతేడాది అక్టోబర్‌ 3న జరిగిన లఖింపుర్ ఖేరీ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లఖింపుర్ ఖేరీ పరిధిలోని టికూనియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.


కింద కోర్టులు ఆశిష్ మిశ్రాకు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అల్‌హాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ రాజీవ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆశిష్ మిశ్రాకు ఎట్టకేలకు బెయిల్ ఇచ్చింది.


ఏం జరిగింది?


యూపీలోని లఖింపుర్ ఖేరిలో 2021 అక్టోబర్ 3న నిరసన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు.  వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.


అయితే కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి కుమారు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు యూపీ సర్కార్, పోలీసులు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. 


దీంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్‌పై నేడు విడుదలయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ ఆశిష్ బయటకు రావడం ప్రాధాన్యంగా మారింది.



Also Read: Fodder Scam Case: లాలూ మళ్లీ జైలు- ఆ కుంభకోణం కేసులో దోషిగా తేల్చిన కోర్టు