దేశంలోని పౌరులకు పోలీసు వ్యవస్థ సామాజిక భద్రతను కల్పిస్తుంది. నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తుుంటుంది. కొన్ని సందర్బాల్లో అమాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కారణం చేత పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చినా.. లేదా ఏదైనా కారణం చేత పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చినా.. ఇలాంటి పరిస్థితుల్లో పౌరుల రక్షణ కోసం రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది. పోలీసు వ్యవస్థలోని విధివిధానాలను అర్థం చేసుకోవడంలో ప్రధానంగా ఐదు రకాల చట్టపరమైన హక్కులు అండగా నిలుస్తున్నాయి. 


పోలీసులు తమ ఇష్ఠానుసారం ఎవరినీ అరెస్ట్ చేయడం కుదరదు. ఏ కేసులోనైనా నిందితుల అరెస్టుకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. అక్రమ అరెస్టు సీఆర్పీసీ ఉల్లంఘన మాత్రమే కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20,21,22లకు విరుద్ధం. పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఈ ఐదు హక్కుల ద్వారా బయటపడవచ్చు. హక్కులపై అవగాహన ఉంటే ప్రశ్నించే ధైర్యం కూడా అలవడుతుంది.



Also Read::
పెన్‌ క్యాప్‌లకు రంధ్రాలు మీ ప్రాణాలు కాపాడటానికే ఉంటాయంటే నమ్మగలరా!


రాజ్యాంగం కల్పించిన ఈ ఐదు రకాల హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ఈ హక్కులు రక్షణ కల్పిస్తాయి. ఇలాంటి చట్టపరమైన హక్కులను ఎప్పుడు, ఎలా, ఏవిధంగా ఉపయోగించాలో క్షుణ్నంగా తెలుసుకుందాం.


మొదటి హక్కు: 
పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా యూనిఫాం ధరించి ఉండాలి. యూనిఫాంకి ఉన్న నేమ్ ప్లాట్‌పై అతని పేరు స్పష్టంగా రాసి ఉండాలి. ఆ పోలీసు అధికారి ఐడీకార్డు లేదా గుర్తింపు కార్డును అడిగే హక్కు ఉంటుంది. అరెస్టయిన వ్యక్తిని ఏ కేసులో, ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది. సీఆర్పీసీ సెక్షన్ 50(1) ప్రకారం అరెస్ట్ సమయంలో పోలీసులు తప్పనిసరిగా కారణాన్ని తెలియజేయాలి.

రెండవ హక్కు: 
ఏదైనా కారణం చేత అరెస్టు కాబడిన వ్యక్తికి, తన చట్టపరమైన హక్కు గురించి అడిగి తెలుసుకునే హక్కు ఉంది. అరెస్టు సమయంలో చట్టపరమైన హక్కుల గురించి పోలీసులను ప్రశ్నించవచ్చు. సహాయం కోసం బంధువులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులను కూడా కాల్ చేయవచ్చు. సీఆర్పీసీ సెక్షన్ 50ఏ ప్రకారం అరెస్టయిన వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా బంధువులకు పోలీసులు సమాచారం ఇవ్వాలి. 



Also Read:
నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?



మూడవ హక్కు: 
ఈ హక్కు మీ న్యాయవాదిని సంప్రదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు న్యాయవాదిని కలిగి ఉండకపోతే, కోర్టుకు అప్పీల్ చేయవచ్చు. ఈ సందర్భంలో కోర్టు మీకు న్యాయవాదిని అందిస్తుంది. సీఆర్పీసీ సెక్షన్ 41డీ ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తికి పోలీస్ విచారణ సమయంలో ఎప్పుడైనా తన న్యాయవాదిని కలిసే హక్కు ఉంటుంది. 

నాలుగో హక్కు: 
సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం పోలీసులు ఏ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా 24 గంటలకు మించి కస్టడీలో ఉంచుకోకూడదు. సీఆర్పీసీ సెక్షన్ 56 ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతి ఉంటేనే 24 గంటల తర్వాత కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.

ఐదవ హక్కు: 
పోలీసు కస్టడీలో అరెస్ట్ అయినవారికి విచారించిన పోలీసు అధికారుల పేర్లను తెలుసుకునే హక్కు ఉంది. పోలీసు కస్టడీ సమయంలో ప్రతి 48 గంటలకు వైద్య పరీక్షలు చేయించుకునే హక్కు కూడా ప్రతి పౌరుడికి ఉంది. సీఆర్పీసీ సెక్షన్ 54 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. అతను కోరితే వైద్యులు తప్పక వైద్య సహాయం అందించాలి.