Nagababu On Garikapati : గరికపాటి-మెగాస్టార్ వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు మరో ట్వీట్ చేశారు. మెగా అభిమానులను కూల్ చేస్తూ, వివాదానికి తెరదించారు. హైదరాబాద్ నాంపల్లిలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి పాల్గొన్నారు. గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఆగ్రహించిన గరికపాటి చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని సీరియస్ అయ్యారు. అయితే అక్కడే మొదలైంది అసలు వివాదం. అంతకు ముందు మాట్లాడిన చిరంజీవి గరికపాటిపై తన గౌరవాన్ని చాటుకున్నారు. కానీ గరికపాటి చిరుపై సీరియస్ అవ్వడంతో మెగా అభిమానులు తట్టుకోలేకపోయారు.
గరికపాటిని టార్గెట్ చేసిన మెగా అభిమానులు
చిరంజీవిపై గరికపాటి అసహనం వ్యక్తం చేయడంపై నాగబాబు ట్వీట్ చేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ విమర్శలు చేశారు. మెగాస్టార్ అభిమానులు రెచ్చిపోయారు. తమ అభిమాన హీరోను అలా అంటారా అంటూ గరికపాటిపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలుచేశారు. గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదానికి నాగబాబు తెరదించారు. తాజాగా మరో ట్వీట్ చేసిన నాగబాబు "గరికపాటి వారు ఏదో మూడ్ లోనో అని ఉంటారు, ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్" అంటూ ట్వీట్ చేశారు.
బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం
‘అలయ్ బలయ్’ వేదికగానే ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు చిరంజీవి, గరికపాటి. కానీ, సోషల్ మీడియా వేదికగా కొంత మంది చిరంజీవిని సమర్దిస్తూ, మరికొంత మంది గరికపాటిని సమర్ధిస్తూ చర్చోపచర్చలు నడుపుతున్నారు. చిరంజీవిపై కొందరు, గరికపాటిపై మరికొందరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నాగబాబు విమర్శలపై బ్రహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. నాగబాబు వ్యాఖ్యలకు ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. “సమాజంతో నటనా, వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందారనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే” అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు మెగాస్టార్ అభిమానులు గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.