Minister Karumuri On BRS : బీఆర్ఎస్ పార్టీపై ఏపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పై తాజాగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదంటున్నారు. జగన్ సింహం, సింహం సింగిల్ గా వస్తుందన్నారు. వైసీపీ ఓటు బ్యాంకుకు వచ్చిన నష్టం ఏంలేదని మంత్రి కారుమూరి అన్నారు. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ వర్గీయుల భార్యలతో పాదయాత్ర చేయిస్తున్నారు. దమ్ముంటే వాళ్ల భర్తలను ముందుకు రమ్మనండి ముసుగులు తొలగిపోతాయంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు.
వైసీపీకి వ్యతిరేక ఓట్లే లేవు
"వైసీపీ ఓటు బ్యాంక్ ఏమాత్రం చీలదు. పవన్ మాట్లాడితే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటున్నారు. అసలు వైసీపీకి వ్యతిరేక ఓట్లే లేవు. అంతా కలిసొచ్చే ఓటు బ్యాంక్ ఉంది. కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ తాత వచ్చినా మాకు ఏం అవ్వదు. సింహం సింగిల్ మాదిరి జగన్ మోహన్ రెడ్డి వస్తారు. వీళ్లంతా కలిసి వచ్చినా వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. "- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
భార్యలు కాదు భర్తలు బయటకు వస్తే
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ తిరిగి అధికారం దక్కించుకుంటుందన్నారు. కేసీఆర్ కాదు కేసీఆర్ తాత వచ్చినా వైసీపీకి వచ్చే నష్టం ఏంలేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి మండిపడ్డారు. రిస్టు వాచీలు, బెంజ్ కారులు పెట్టుకున్న వాళ్లు చేస్తున్న పాదయాత్ర అని విమర్శించారు. అమరావతి పాదయాత్రలో భార్యలు కాదు భర్తలు బయటకు వస్తే ముసుగు తొలగిపోతుందన్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న యాత్ర అని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో పాదయాత్రను టీడీపీ కార్యకర్తలు మాత్రమే స్వాగతిస్తున్నారని, ప్రజలు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా వైసీపీకి వచ్చిన నష్టమేం లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు బొమ్మ చూపించారన్నారు. దౌర్జన్యంగా రైతుల భూములు స్వాధీనం చేసుకున్న చరిత్ర టీడీపీదని విమర్శించారు.
మార్చి నుంచి పోర్టిఫైడ్ రైస్ పంపిణీ
వచ్చే ఏడాది మార్చి నెల నుంచి అన్ని జిల్లాల్లో పోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కారుమూరి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ధాన్యం కొనుగోలులో చెల్లింపులు ఆలస్యం కాకూడదన్నారు. అంతకు ముందు రేషన్ సరఫరా 85 శాతం ఉండేదని, ఇప్పుడు 92 శాతానికి చేరుకుందని మంత్రి స్పష్టం చేశారు. ఎరువుల దుకాణాల్లో తూకం కొలతల లోపాల్ని సరిచేస్తామన్నారు. తనిఖీలు నిర్వహించి ఇప్పటికే 189 కేసులు పెట్టామని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిత్యావసర వస్తువులు ధరలు తక్కువగా ఉన్నాయన్నారు.