తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ మరో వారంలో విడుదల కానుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలు రాయాలా? వద్దా? అనేది పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు వెల్లడించారు.
కాలేజీలు ప్రారంభమై.. క్లాసులు కూడా జరుగుతోన్న తరుణంలో పరీక్షలేంటి అని అనుకుంటున్నారా? ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా బోర్డు పరీక్షలు నిర్వహించలేదు. ఫస్టియర్ విద్యార్థులందరినీ సెకండియర్‌లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది టెన్త్ ఉత్తీర్ణత సాధించి, ఇంటర్మీడియట్ కోర్సులో చేరిన వారి సంఖ్య 4.7 లక్షలుగా ఉంది. వీరంతా పరీక్షలు రాయకుండానే సెకండియర్‌కు ప్రమోట్ అయ్యారు.
Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
అభ్యంతరాలు రావడంతో..
పరీక్షలు రాయకుండా తర్వాతి సంవత్సరంలోకి ప్రమోట్ చేయడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కొలమానమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాయాలనుకునే వారికి కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక పరీక్షలు పెడతామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత కాస్త తగ్గముఖం పట్టడంతో పరీక్షలు జరపాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి మరో వారంలో షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నారు.
భిన్న వాదనలు..
ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ క్లాసులు జరుగుతున్నాయి. వీరికి చాలా వరకు సిలబస్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో ఫస్టియర్ పరీక్షలు జరపడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. పరీక్షలు జరపాలంటే కనీసం పక్షం రోజుల ముందుగా షెడ్యూల్ ఇవ్వాలని.. విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు. వచ్చే వారంలో షెడ్యూల్ విడుదల చేస్తే.. పరీక్షల సమయానికి నెల రోజుల గడువు వస్తుందని అధికారులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షల షెడ్యూల్ త్వరగా విడుదల చేయాలని.. ఆలస్యమైతే సెకండియర్ తరగతులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ విడుదలపై గందరగోళం నెలకొంది. పరీక్షల షెడ్యూల్‌పై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.