హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేశారు. దీని ప్రకారం.. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించాలి. ధ్రువపత్రాల పరిశీలన.. సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. సెప్టెంబరు 4 నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 


సెప్టెంబరు 15 నుంచి 20 వరకు..
సెప్టెంబరు 15వ తేదీన ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 15 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Also Read: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?


25న ఫలితాలు వెలువడే ఛాన్స్.. 
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఈ నెల 25న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను వీటి తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 30 నుంచి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. 


రేపే తెలంగాణ పీజీఈసెట్.. 


తెలంగాణలోని ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (పీజీఈసెట్‌ 2021) పరీక్షలు రేపటి నుంచి (ఆగస్టు 11) ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 23,187 మంది హాజరుకానున్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. హైదరాబాద్‌లో 17,864 మంది విద్యార్థులు, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాయనున్నట్లు కన్వీనర్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు.  


Read More: TS PGECET 2021 Exam Date: రేపే తెలంగాణ పీజీఈసెట్.. షెడ్యూల్ ఇదే..


Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు