తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్) పరీక్షలు రేపటి నుంచి (ఆగస్టు 11) ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 14 వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 23,187 మంది హాజరుకానున్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 17,864 మంది, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాయనున్నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
రెండు సెషన్లలో..
పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11, 12, 13, 14 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మార్నింగ్ సెషన్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మొదటి సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్టింగ్ టైమ్ 8.30గా ఉంది. ఇక మధ్యాహ్నం సెషన్‌కు 12.30గా నిర్దేశించారు.
Also Read: NEET 2021 Registration: విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
19 పేపర్లలో పరీక్ష..
పీజీఈసెట్ పరీక్ష ద్వారా గేట్ జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ / ఎంటెక్ / ఎంఫార్మా / గ్రాడ్యుయేట్ లెవల్/ ఎంఆర్క్ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పీజీఈసెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షను మొత్తం 19 (ఫార్మసీతో కలిపి) పేపర్లలో నిర్వహించనుంది. అభ్యర్థులు బీటెక్‌లో చదివిన బ్రాంచ్ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తోంది. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ సహా మాక్ టెస్టులు హాజరవ్వడానికి pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
పరీక్ష షెడ్యూల్ ఇదే..
- ఆగస్టు 11న జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మెటిక్స్ (జీజీ), ఫార్మసీ విభాగాలకు పరీక్షలు మొదటి సెషన్‌లో జరుగుతాయి. మధ్యాహ్నం సెషన్‌లో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఎరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాలకు పరీక్షలు ఉంటాయి.
- ఆగస్టు 12న ఉదయం సెషన్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), బయో టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి పరీక్ష ఉంటుంది.
- ఆగస్టు 13న ఉదయం సెషన్‌లో ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాలకు పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగాలకు పరీక్షలు ఉంటాయి.
- చివరి రోజైన ఆగస్టు 14న మార్నింగ్ సెషన్‌లో ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్.. రెండో సెషన్‌లో నానో టెక్నాలజీ పరీక్షలు ఉంటాయి.