కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పిల్లల చదువులన్నీ గందరగోళంలో పడ్డాయి. వారు సరిగ్గా స్కూలుకు వెళ్లి ఏడాదిన్నర అవుతోంది. రెండో వేవ్‌కు ముందు స్కూళ్లు తెరిచినప్పటికీ కేసులు పెరిగిపోవడంతో మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెండో వేవ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. మళ్లీ స్కూళ్లు తెరవాలని పాఠశాల విద్యాశాఖ కోరుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఈ క్రమంలో కొవిడ్ మూడో వేవ్ హెచ్చరికలు ఉన్నందున ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సాధ్యమా అనే సందేహం తలెత్తుతోంది.


ఆగస్టు 15 నుంచి తెరవాలి: విద్యాశాఖ
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను దశలవారీ పద్ధతిలో ఇప్పటికే తెరిచారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణలో కూడా స్కూళ్లు తెరవడంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 1న జరిగిన మంత్రి మండలి సమావేశానికి ముందు రోజు తాము నివేదికను సమర్పించామని, కానీ ఆ విషయం కేబినెట్‌లో చర్చించలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15 తర్వాత స్కూళ్లను దశల వారీగా మొదలుపెట్టాలని తాము సూచించామని చెప్పారు.


అయితే, స్కూళ్లను రోజు విడిచి రోజు కరోనా నిబంధనలతో తెరవాలని ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనికి తగ్గట్లుగా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో స్కూళ్లు తెరవడం లేదు. అయితే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరచుకుంటే ఇక్కడ కూడా స్కూళ్లు తెరవాలని ఒత్తిడి వస్తుంది కాబట్టి.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.


Also Read: Telangana ACB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏవో, ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్.. ఏసీబీ అధికారులు షాక్!


వివిధ రాష్ట్రాల్లో ఇలా..
ఏపీలో ఈనెల 16 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నారు. తమిళనాడులో సెప్టెంబరు 1 నుంచి మొదలుపెట్టనున్నారు. అక్కడ 9 నుంచి 12 తరగతులను 50 శాతం విద్యార్థులతో నేరుగా క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కర్ణాటకలో 9 నుంచి 12 తరగతులకు ఈ నెల 23 నుంచి ఆఫ్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టనున్నారు. ఇక్కడ విద్యార్థులను రెండు గ్రూపులుగా వేరు చేసి రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి సగం మంది విద్యార్థులతో 11వ తరగతిపైబడిన విద్యాసంస్థలు తెరవనున్నారు. ఒడిశాలో జులై 26 నుంచి ఈ తరగతులనే ప్రారంభించనున్నారు. కేసులు అధికంగా ఉండే మహారాష్ట్రలోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈనెల 17 నుంచి తరగతులు నిర్వహించాలని ఉద్ధవ్ ప్రభుత్వం నిర్ణయించింది.


Also Read: Pradeep Machiraju: డియర్ కేటీఆర్.. నేను చాలా హ్యాపీ, ఆ ప్రోగ్రాం చాలా గొప్పది.. మంత్రిని కలిసిన యాంకర్ ప్రదీప్