తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7 వర్సిటీల పరిధిలో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2021) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 25వ తేదీతో ముగియనుంది.


ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30వ తేదీ వరకు.. రూ.2000తో సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సీపీజీఈటీ సెట్‌ కన్వీనర్‌ పాండు రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీజీఈటీ పరీక్షలను సెప్టెంబరు 8 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 


దరఖాస్తు రుసుము ఒక్కో సబ్జెక్టుకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.600, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800గా ఉంది. అదనంగా మరో సబ్జెక్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.osmania.ac.in, http://www.tscpget.com/, http://ouadmissions.com/, http://www.tscpget.com/ వెబ్ సైట్లను సంప్రదించవచ్చు. 


Also Read: GATE 2022 Exam Date: గేట్ పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి కొత్తగా రెండు పేపర్లు..


ఏయే వర్సిటీల్లో చేరవచ్చు?
ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, జేఎన్టీయూ (జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌) యూనివర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. 


విద్యార్హత వివరాలు..
సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ( బీఏ/ బీకామ్/ బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పైన పేర్కొన్న కోర్సుల్లో ఫైనలియర్ చదువుతోన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అయినటు వంటి ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏలకు ఇంటర్ పూర్తయిన వారు అర్హులు.


పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎల్ఎల్బీ (5 ఏళ్లు) పూర్తి చేసిన వారు తమ విద్యార్హతను ఆధారంగా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలు పొందాలనుకునే కోర్సును బట్టి విద్యార్హత మారుతోంది. కాబట్టి కోర్సులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. 


ఏయే కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు?
సీపీజీఈటీ-2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్ అండ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగాల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. 


పరీక్ష విధానం..
ఈ పరీక్షను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి తన విద్యార్హతను బట్టి కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంది. 


Also Read: Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?