గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)- 2022 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష తేదీలను ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈసారి కొత్తగా జియోమాటిక్స్ ఇంజనీరింగ్ (జీఈ- GE ), నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (ఎన్ఎమ్- NM) అనే రెండు పేపర్లను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టిన రెండింటితో కలిపి మొత్తం గేట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. 


గేట్ - 2022 పరీక్షలను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానం (CBT) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. గేట్ పరీక్ష సమయం 180 నిమిషాలుగా ఉంది. గేట్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 195 కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. గేట్ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారిక వెబ్‌సైట్‌ www.iitkgp.ac.in ను సంప్రదించవచ్చు. 


ఈసారి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో పాటు.. బీడీఎస్, ఎంఫార్మసీ చదివిన వారికి కూడా గేట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ వెల్లడించారు. బీడీఎస్, ఎంఫార్మసీ గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నౌకా నిర్మాణ పరిశ్రమలు, జియో ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు ఉండటంతో ఈ బ్రాంచుల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 


గేట్ స్కోర్‌తో లాభాలెన్నో..
గేట్​ స్కోర్​ ఆధారంగా ఐఐటీ, ఎన్​ఐటీ వంటి సంస్థలతో పాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఎంఈ లేదా ఎంటెక్ కోర్సులలో​ ప్రవేశాలు పొందవచ్చు. విదేశాల్లోని యూనివర్సిటీలు కూడా గేట్​ స్కోర్​ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. గేట్​ స్కోర్​ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. బీహెచ్​ఈఎల్​, పవర్​ గ్రిడ్​, బెల్​, డీఆర్​డీఓ, గెయిల్​, హాల్, ఇండియన్​ ఆయిల్​ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలు.. కేవలం గేట్​ స్కార్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి, వారికి ఇంటర్వూ నిర్వహించి రిక్రూట్​ చేసుకుంటున్నాయి.