ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఎంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలో చాటే ఘటన ఇది. ఒక్కడే రైలు ప్రయాణం చేసి వచ్చిన ఓ వ్యక్తి.. రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్‌లో స్నానానికి వెళ్లగా.. తిరిగొచ్చేసరికి అతని బ్యాగు మాయమైంది. బట్టలు, ఫోను, డబ్బులు అన్నీ అందులోనే ఉండిపోయాయి. కేవలం అతని ఒంటిపై ఉన్న టవల్ తప్ప ఏమీ లేవు. వెంటనే అతను ఆ పరిస్థితుల్లోనే రైల్వే పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఉంది. ఆ బ్యాగ్ కొట్టేసిన వ్యక్తికి చెందిన బ్యాగును.. అంతకు కొద్ది గంటల ముందు రైలులో మరెవరో దొంగిలించారు. దీంతో అతను రైల్వే స్టేషన్‌లోని మరో వ్యక్తి బ్యాగును దొంగిలించాడు. పూర్తి వివరాలివీ..


ఆంధ్రప్రదేశ్‌‌లోని శ్రీకాకుళానికి చెందిన మూల సునీల్‌కుమార్‌ అనే 24 ఏళ్ల వ్యక్తికి చెందిన బ్యాగు రైలులో ఎవరో కొట్టేశారు. అతను హైదరాబాద్‌కు రైల్లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఏం చేయాలో తెలియక ఇంకొకరి బ్యాగును కొట్టేయాలని అతను నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చాడు. బ్యాగు కొట్టేసేందుకు స్టేషన్ మొత్తం గాలించాడు. ప్లాట్ ఫాం నెం.1లో ఉన్న వెయిటింగ్ హాల్‌కు వచ్చాడు. అక్కడ బ్యాగు కొట్టేసేందుకు చాలా టైం చూశాడు.


అప్పుడే శివశంకర్ అనే వ్యక్తి అతనికి ఒంటరిగా కనిపించాడు. శివ శంకర్ విజయనగరంలో టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. అతను హైదరాబాద్‌కు హెడ్ ఆఫీస్‌లో మీటింగ్ కోసం వచ్చాడు. ఇందుకోసం రైల్వే స్టేషన్‌లోని వేచి ఉండేగదిలో ఉండి స్నానం చేసి వెళ్దామనుకున్నాడు. వెయిటింగ్‌ హాల్‌లో బ్యాగును ఉంచి బాత్రూంకు వెళ్లి స్నానం చేసి వచ్చాడు. ఫోన్లు, వ్యాలెట్ అన్నీ బ్యాగులోనే ఉంచి వెళ్లాడు. అతను స్నానం చేసి తిరిగొచ్చేలోపు బ్యాగు కనిపించలేదు. బట్టలు, ఫోన్, రూ.7 వేలు డబ్బు ఉన్న అతని బ్యాగును తొలుత రైలులో బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తి దొంగిలించాడు. 


బాత్రూం నుంచి కేవలం ఒంటిపై టవల్‌తో మాత్రమే వచ్చిన అతను బ్యాగు లేకపోవడం చూసి కంగుతిన్నాడు. చేసేది లేక అతడు అలాగే జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన బ్యాగు పోయిందని ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు తక్షణ సాయంగా వారి వద్ద ఉన్న బట్టలు ఇచ్చి వేసుకోమని చెప్పారు. పోలీసుల ఫోన్ నుంచి బాధితుడు తన స్నేహితులకు ఫోన్‌ చేసి, వారిని రప్పించుకొని దుస్తులు కొనుక్కొని అతను మీటింగ్‌కు వెళ్లాడు. పోలీసులు సీసీటీవీ కెమెరాలు గమనించి నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి రూ.7 వేల నగదు, బ్యాగుతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం ఎందుకు చేశావని ప్రశ్నించగా.. తన బ్యాగును రైలులో ఎవరో కొట్టేశారని, అందుకే తాను కూడా ఇంకొకరి బ్యాగును దొంగిలించానని చెప్పాడు.