తెగేదాకా లాక్కండి..!  అంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో సారి అలజడి రేపుతోంది. ఆయన ఈ ట్వీట్‌ను దేని గురించి పెట్టారో చెప్పలేదు కానీ తెలుగులో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ట్రెండింగ్ టాపిక్ అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల గురించేనని చిత్ర పరిశ్రమలో చర్చ ప్రారంభమైంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న "మా" అసోసియేషన్ కార్యవర్గ పదవీ కాలం పూర్తయింది. ఎన్నికలు సెప్టెంబర్‌లో పెడతామని ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ గతంలో ప్రకటించారు. కానీ తక్షణం పెట్టాల్సిందేనని ప్రకాష్ రాజ్ ప్యానల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆయన మద్దతుదారులైన ప్రస్తుత కార్యవర్గంలోని 15 మంది తక్షణం ఎన్నికలు పెట్టాలని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయిన కృష్ణంరాజుకు లేఖ రాశారు. 


రెండు సార్లు లేఖలు రాసిన తర్వాత  వర్చువల్‌గా కృష్ణంరాజు "మా" కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఆగస్టు 22న "మా"  జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని...సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఎన్నికల ప్రకటన చేయలేదు. అయితే కృష్ణంరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. "మా" ప్రస్తుత కార్యవర్గానికి చట్టబద్దత ఉన్నట్లేనని, ఎన్నికలు జరిగే వరకు గరిష్టంగా 6 సంవత్సరాల వరకు అధికారం ఉంటుందని న్యాయనిపుణులు తేల్చారని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికలు పెట్టరేమోనన్న ఆందోళనకు ప్రకాష్ రాజ్ వచ్చారని చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రకాష్ రాజ్ అసంతృప్తికి గురై.. తెగె దాకా లాగొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 


"మా" ఎన్నికలు టాలీవుడ్‌లో  సస్పెన్స్ ధ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించి రంగంలోకి దిగారు. తర్వాత వరుసగా అనేక మంది తెరపైకి వచ్చారు. మంచు విష్ణు ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆయనకు టాలీవుడ్‌లోని ఓ వర్గం గట్టి మద్దతు ఇస్తోంది. ప్రకాష్‌రాజ్‌కు మరో బలమైన వర్గం మద్దతిస్తోంది. తాము కూడా పోటీ చేస్తామని హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు లాంటివారు ప్రకటించారు. అయితే..  పెద్దలందరూ ఏకగ్రీవం అని నిర్ణయిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని విష్ణు ఆఫర్ ఇచ్చారు. కానీ ఎవరూ స్పందించలేదు. అందుకే ప్రస్తుత ప్రకాష్ రాజ్ ట్వీట్ హైలెట్ అవుతోంది. సాధారణంగా ప్రకాష్ రాజ్.. జాతీయ అంశాలపై ఇంగ్లిష్‌లో ట్వీట్లు చేస్తుంటారు. టాలీవుడ్‌కు సంబంధించినది కాబట్టే తెలుగులో ట్వీట్ చేశారని అంటున్నారు.