86 ఏళ్లకు టెన్త్ క్లాస్ పరీక్ష పాసవ్వాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు ఓ పెద్దాయన. ఆయనేమీ టెన్త్ పాసయితే పెన్షన్ వస్తుందన్న ఆశతోనో.. మరో ప్రమోషన్ వస్తుందన్న కోరికతోనే ఈ పరీక్ష పాసవ్వాలని ప్రయత్నించడం లేదు. అది ఆయనకు ప్యాషన్. ఇంకా చెప్పాలంటే ఆయన అధిగమించని ఉన్నత శిఖరాలు లేవు. అలాగే పడిపోని పాతాళాలు కూడా లేవనుకోండి వేరే విషయం. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా. 86 ఏళ్ల వయసు ఉన్న ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. మిగతా సబ్జెక్టులన్నీ నాలుగేళ్ల కిందటే పూర్తయ్యాయి. ఇంగ్లిష్ ఒక్కటే పెండింగ్ ఉంది.
ఓం ప్రకాశ్ చౌతాలా చిన్నప్పుడు చదువుకోలేకపోయారు. చిన్నప్పటి నుండి ఇతర వ్యవహారాల్లో పడి.. రాజకీయాలు చేస్తూ బిజీగా గడిపారు. ఈ కారణంగా పదో తరగతి పాసవ్వాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన ఓ తప్పు చేయకపోతే.. ఈ కోరిక ఇప్పటి వరకూ నెరవేరేది కాదేమో. ఆ తప్పేమిటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కామ్‌కు పాల్పడటం. హర్యానాలో టీచర్ల నియామకంలో లో పెద్ద స్కాం జరిగింది. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. చివరికి విచారణ అనంతరం ఆయనకు 2013లో సీబీఐ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే తన పదో తరగతి పరీక్షల గురించి ఆలోచించారు.
తీహార్ జైలులో పదో తరగతి పరీక్షలకు ప్రీపేర్ అయ్యారు. ఎంతో మంది విద్యార్థుల్లాగే ఇంగ్లిష్ ఆయనకు కూడా టఫ్ సబ్జెక్ట్. పాస్ కాలేకపోయారు. 2017లో తన 82 ఏళ్ల వయస్సులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష రాశారు. అందులో 53.4 శాతం మార్కులు సాధించారు. కానీ ఇంగ్లిష్ పెండింగ్‌లో ఉండిపోయింది. తర్వాత ఓపెన్‌లో భివాని ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు వచ్చాయి. కానీ చౌతాల ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. కారణం ఏంటా అని ఆరా తీస్తే టెన్త్‌లో ఇంగ్లిష్ పాస్ కానందున నిలిపివేశామని సమాధానం ఇచ్చారు. దాంతో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను క్లియర్ చేయాలని.. కంపార్టుమెంట్ పరీక్ష రాశారు.
ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే. అయితే ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే మనవడు డిప్యూటీసీఎంగా ఉన్నా ఆయన పరీక్ష రాయక తప్పలేదు.