కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్‌పై పడింది. ముఖ్యంగా హీరో నానీ సినిమాలకు పెద్ద సవాలుగా మారింది. వైరస్ పీక్ సమయంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. అయితే, అది ఆశించినంత ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా ‘టక్ జగదీష్’ సినిమా కూడా ఓటీటీ బాట పట్టడంతో థియేటర్ల యాజమాన్యం ఆగ్రహంతో ఉన్నారు. ఇది కాకుండా నాని నటిస్తున్న మరో కొత్త చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. దీనిపై ఆ చిత్ర యూనిట్ స్పందించింది. అయితే, ‘టక్ జగదీష్’ విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. 


కొద్ది రోజల కిందట నాని ‘టక్ జగదీశ్’ మూవీపై నాని చేసిన ట్వీట్.. నేపథ్యంలో థియేటర్ యాజమానులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలపై వస్తున్న ప్రచారానికి నాని ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్‌లో నిలబడినట్టు అయ్యిందని తెలిపాడు. సినీ అభిమానిగా తనకు కూడా ప్రేక్షకులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు ఇష్టమని నాని లేఖలో పేర్కొన్నాడు. ‘టక్ జగదీశ్’ మూవీని థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తీశామన్నాడు. కానీ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోకపోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయాన్ని వారికే వదిలేశానని తెలిపాడు. నిర్మాతలు థియేటర్లలో రిలీజ్‌కు అంగీకరిస్తే మొదట సంతోషించేది తానని నాని పేర్కొన్నాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా.. సహకరిస్తానని, తుది నిర్ణయం వారిదేనని తెలిపాడు. 


లాక్‌డౌన్ వల్ల మూతపడిన థియేటర్లు గత నెల 23 నుంచి తెరుకున్నా.. పెద్దగా సినిమాలేవీ విడుదల కాలేదు. ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ మాత్రమే విడుదలయ్యాయి. తాజాగా ‘రాజ రాజ చోర’, ‘క్రేజీ అంకుల్స్’, ‘కనబడుటలేదు’ సినిమాలో కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని నటించిన ‘టక్’ జగదీష్ వంటి భారీ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘టక్ జగదీష్’ హక్కులను ఓ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్న నేపథ్యంలో నిర్మాతలు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం సమావేశమయ్యారు. 


‘టక్ జగదీష్’ టీజర్:


ఈ వివాదం ఇలా సాగుతుంటే.. నాని నటిస్తున్న మరో చిత్రం ‘శ్యామ్  సింగరాయ్’ కూడా ఓటీటీలోనే విడుదల కానుందనే ప్రచారం ఊపందుకుంది. ఇది కూడా నానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ ఓటీటీ సంస్థ రూ.40 కోట్లు చెల్లించిందని, ఇందుకు నిర్మాతలు కూడా అంగీకరించారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్ర యూనిట్ స్పందించక తప్పలేదు. ఈ ప్రచారంలో నిజం లేదని, ఈ సినిమా విడుదలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి నటిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత


Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్