ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)-2022 పరీక్ష ఆదివారం (జులై 17) జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి 18,72,329 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో 10.64 లక్షల మంది బాలికలే కావడం విశేషం. బాలురు 8,07,711గా ఉన్నారు. 13 భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నీట్‌ను రాయవచ్చు.
దేశవ్యాప్తంగా 546 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో నీట్ పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో 150కి పైగా పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
20 నిమిషాలు పెరిగిన పరీక్ష సమయం
గతంలో పరీక్ష సమయం 3 గంటలు ఉండగా.. ఈ సారి 20 నిమిషాల సమయాన్ని అదనంగా కల్పించారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయం ఇవ్వగా.. ఇందులో 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. గతేడాది 200 ప్రశ్నలిచ్చి 180 నిమిషాల్లోనే 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వచ్చేది. దీంతో ఆ అదనపు 20 నిమిషాలు ప్రశ్నలను చదువుకొని, సమాధానం ఇవ్వడానికి సరిపోయేది కాదు. ఇప్పుడా విషయంలో వెసులుబాటు కల్పించారు.
NEET 2022: వేరే ఊర్లో నీట్ సెంటర్ పడిందని దిగులా? ఓయో అదిరిపోయే ఆఫర్!
ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
* పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది.
* ధ్రువీకరణ కోసం అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను పరీక్ష హాల్‌కు తీసుకురావడం తప్పనిసరి.
* అడ్మిట్ కార్డులపై పరీక్ష కేంద్రం వివరాలు, రిపోర్టింగ్ సమయంతో పాటు ఇతర సూచనలు ఉంటాయి.
* మధ్యాహ్నం 1:15 గంటలకు అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
* 1:30 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి రావడానికి అభ్యర్థులను అనుమతించరు.
* పరీక్షకు సంబంధించిన సూచనలను మధ్యాహ్నం 1:20 నుంచి 1:45 వరకు అధికారులు చేయనున్నారు.
* ఈ పరీక్ష జూలై 17వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 5:20 గంటల వరకు జరగనుంది.
నీట్ పరీక్ష రాసే విద్యార్థులు పాటించాల్సిన డ్రెస్ కోడ్ నిబంధనలివే..
* నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు బట్టలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ పొడుగు చేతులు ఉండే బట్టలు ధరించవద్దు. మతపరమైన సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించాల్సి వస్తే మాత్రం.. ఆ విద్యార్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉంటుంది. వారిని పరీక్ష కేంద్రంలో తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతించనున్నారు.
* నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరూ బూట్లు ధరించవద్దు. అలా వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. తక్కువ హీల్ ఉండే సాండిల్స్, స్లిప్పర్లను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. పౌచ్, గాగుల్స్, వ్యాలెట్, టోపీలు, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావొద్దని నిబంధనల్లో పేర్కొంది.
* పెన్సిల్ బాక్సులు, కాలిక్యూలేటర్లు, స్కేల్, పెన్నులు, రైటింగ్ ప్యాడ్స్ కూడా లోపలికి అనుమతించరు. ఇక మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్స్, హెల్త్ బ్యాండ్స్, బ్లూటూత్, స్మార్ట్ వాచ్ లతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్ లను వెంట తీసుకురావొద్దని ఆదేశాల్లో తెలిపింది.
* అమ్మాయిలు ముక్కు పుడక, చెవిపోగులు, చైన్లు, నెక్లెస్, బ్రాస్లెట్ ఆభరణాలు, అబ్బాయిలు బ్రాస్లెట్లు, చైన్లతో పరీక్షా కేంద్రానికి రావొద్దని ఆదేశాల్లో పేర్కొంది.
* నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు తీసుకురావొద్దని, ఒకవేళ వెంట తీసుకొచ్చిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని NTA తెలిపింది. షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం తినుబండారాలు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది.