CM KCR : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ లో నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శనివారం ప్రగ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన  టీఆర్ఎస్ పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజ‌ర‌య్యారు. పార్లమెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.  తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా  రాష్ట్ర విభజన హామీలతో పాటు బీజేపీ అసంబద్ధ వైఖరి ఎండగట్టే కార్యాచరణపై ఎంపీలతో సీఎం చర్చించారు.          


కేంద్రంపై పోరాటం 
                                                                            
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. తెలంగాణ బిడ్డలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందుకు పార్లమెంట్ ఉభయ సభలను సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.  ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయని, కానీ పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. 


ఆర్బీఐ బిడ్లలో తెలంగాణకు డిమాండ్


రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్నుకుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్థికంగా తెలంగాణను అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు.  తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని సీఎం అన్నారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం, నేరపూరిత చర్య అని సీఎం స్పష్టం చేశారు. 


ఎఫ్ఆర్బీఎం లిమిట్ తగ్గింపుపై 


ప్రతి ఏటా ఎఫ్ఆర్బీఎం లిమిట్ ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై బడ్జెట్లను రూపొందించుకుంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఎఫ్ఆర్బీఎం లిమిట్ రూ.53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగా రూ.53 వేల కోట్ల లిమిట్ ను రూ.23,000 కోట్లకు కుదించారని ఆరోపించారు. ఇటువంటి దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాల మీద ఒత్తిడి తేవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.