Black Fever Symptoms:


11 జిల్లాల్లో బ్లాక్ ఫివర్ బాధితులు..


పశ్చిమ బంగలో కొత్త జబ్బు ప్రజలను భయపెడుతోంది. కాలా అజర్‌గా పిలుచుకునే బ్లాక్ ఫివర్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారాల వ్యవధిలోనే 65 మంది ఈ బ్లాక్ ఫివర్ బారిన పడ్డారు. పశ్చిమ బంగలోని 11 జిల్లాల్లో బాధితులున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలోని ప్రజల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. నిజానికి రాష్ట్రంలో బ్లాక్ ఫివర్ కేసులు ఇక నమోదు కావని ధీమాగా ఉన్నారంతా. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిఘా సంస్థ ఇదే విషయాన్ని వెల్లడించింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ కేసులు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోల్‌కతాలో మాత్రం ఇప్పటి వరకూ బ్లాక్‌ ఫివర్ బాధితులు కనిపించలేదు. ఉన్నట్టుండి కేసులు పెరగటం వల్ల వైద్యారోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. డార్జ్‌లింగ్, మల్దా,ఉత్తర్ దింజాపూర్, దక్షిణ్ దింజాపూర్, కలిమ్‌పాంగ్ ప్రాంతాల్లో బ్లాక్ ఫీవర్ తీవ్రత అధికంగా ఉంది. బిర్‌బుమ్, బంకుర, పురులియ, ముర్షిదాబాద్ జిల్లాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. "సాండ్ ఫ్లైస్" ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్లాక్ ఫివర్‌కు లీష్‌మానియా దొనొవని అనే పారాసైట్‌ కారణం. 


అక్కడి నుంచి వారిలోనే అధికం..


బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎక్కువ రోజుల పాటు ఉండి, పశ్చిమ బంగకు తిరిగొచ్చిన వారిలో ఈ బ్లాక్ ఫివర్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. కొన్ని రోజుల పాటు నిఘా ఉంచి, ఈ విషయం నిర్ధరిస్తామని వెల్లడించారు. ఈ వ్యాధితో బాధ పడే వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించనుంది. ప్రైవేట్ ల్యాబ్‌లో కానీ ఆసుపత్రిలో కానీ ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించినట్టైతే, వెంటనే జిల్లా ఆరోగ్య అధికారిని అప్రమత్తం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య ఖర్చులతో పాటు వారి తిండి ఖర్చుని కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ భరించనుంది. ఆయా ప్రాంతాల ఆరోగ్యాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. 


ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి వ్యాప్తి..


ఇది ప్రాణాంతక వ్యాధి అని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దాదాపు 95% కేసుల్లో వైద్యం అందించినా, తగ్గే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, లివర్ ఎన్‌లార్జ్‌ అవటం, ఎనీమియా లాంటి లక్షణాలు బ్లాక్‌ ఫివర్ సోకిన వారిలో కనిపిస్తాయి. బ్రెజిల్‌, ఈస్ట్‌ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు భారత్‌లోనూ కలవరపెడుతోంది. నిరుపేద కుటుంబాల్లోని ప్రజల్లో పోషకాహారా లోపం ఉంటుంది. వీరినే ఈ బ్లాక్‌ ఫివర్ ఎక్కువగా వేధిస్తుంది. ఇమ్యునిటీ తక్కువగా ఉన్న వారికీ తొందరగా ఈ వ్యాధి సోకుతుంది. 


Also Read: GST Hike on Daily Essentials: సోమవారం నుంచి పెరగనున్న వంటింటి ఖర్చు! పెరుగు, బియ్యంపై పన్ను రేట్ల పెంపు!!