గోదావరి ఉద్ధృతి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ధవళేశ్వరం  వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  సమానంగా 24.57 లక్షల క్యూసెక్కులు ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ ప్రవాహం 28 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.  


వరద ప్రవాహం అధికంగా ఉందని గ్రహించిన మంత్రి అంబటి రాంబాబు నేరుగా రంగంలోకి దిగారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించారు. వరద పరిస్థితి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద నుంచి వరద పరిస్థితిపై ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కే. మాధవీలతతో సమీక్షి చేపట్టారు. 


ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముంపు ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ బృందాలతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు.


జిల్లా వరదల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రస్తుత వరద పరిస్థితిని మంత్రికి వివరించారు. ముంపు గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పామన్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు కొందరు సిద్ధంగాలేరని విషయాన్ని మంత్రి దృష్టి తీసుకొచ్చారు. ముంపు తమ ఏం చేయదనే ధీమాతో ఉన్నట్టు తెలిపారు. వరద పరిస్థితికి అనుగుణంగా అవసరమైన పక్షంలో ప్రతి ఒక్కరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.


ఇరిగేషన్ ఎస్ఈ నరసింహరావు గోదావరి గట్ల పరిస్థితి, వాటి పటిష్టత కోసం తీసుకున్న చర్యలు మంత్రికి వివరించారు. మంత్రితోపాటు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, రూడా ఛైర్‌పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 


గోదావరి ఉప్పెన కారణంగా అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4 మండలాలపై ఎఫెక్ట్ ఉంటుందని లెక్కలు కట్టారు. ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలను కూడా వరద ఇబ్బంది పెట్టనుందని భావిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీని ప్రకారం వారికి సహాయ సహకారాలు అందిస్తోంది జిల్లా యంత్రాంగం. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని  42 మండలాల్లో  279 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.