పెరిగిన అవసరాలు.. అత్యాధునిక వసతులవైపు పరుగులు.. మరోవైపు ప్రకృతి సహజసిద్దంగా ఏర్పడిన వాటిని వినాశనం చేయడం.. ఇవన్ని కలగలిపి ఇప్పుడు ముప్పుగా మారుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. గోదావరి వరదల వెనుక రెండు భారీ ప్రాజెక్టులే కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉండచ్చు. అయితే ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా గతంలోనూ ఇంతకంటే భారీ వర్షాలు వచ్చాయి. కానీ అవి ఇంతగా ప్రభావం మాత్రం చూపలేదు. అయితే వరద నీరు నేరుగా గోదావరిలోకి రాదు. ముందుగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండిన తర్వాతనే అక్కడ పెరిగిన నీరు గోదావరిలోకి చేరుతుంది. ఇందుకు కనీసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు అందుకు విరుద్దంగా వాగులు, వంకలు ఒకేసారి పొంగుతున్నాయి. ఆ నీరంతా గోదావరిలోకి చేరుతుంది. అయితే కురిసిన వర్షపాతం నేరుగా గోదావరిలోకి ఎందుకు చేరుతుందనే విషయంపై ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కనమరుగవుతున్న చెరువులు, కుంటలు కారణం కావచ్చా..?
గత ఐదేళ్ల కాలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని 300 రెట్లు భూముల ధరలు పెంచేశారు. ఇంకేం ఎక్కడ భూమి కనిపించినా వదలడం లేదు. ఈ కారణంగా చాలా గ్రామాల్లో సహజ సిద్దంగా ఏర్పడిన చెరువులు, కుంటలు మాయమయ్యాయి. అధికారుల అలసత్వం, కొన్ని చోట్ల అవినీతి వెరసి చెరువుల మాయం అవుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు శిఖం భూములు పోయి వరద నీటిని ఆపే సహజసిద్దమైన పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఎక్కడ వర్షం కురిసినా ఆ వరద అక్కడే కొంత నిల్వ ఉండకుండా నేరుగా వాగులు, వంకల ద్వారా నదులోకి చేరిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న వరదలకు అన్యాక్రాంతమైన చెరువులు, కుంటలు ఒక్క కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సాక్షాత్తు హైదరాబాద్ నగరమే ఒక సాక్ష్యంగా చెబుతున్నారు. ఇక్కడున్న సహజసిద్దంగా ఉన్న చెరువులు మాయం కావడంతో వరద నీరు నగరాన్ని చుట్టుముట్టేస్తుందంటున్నారు.
ఇసుక మాఫియాతో ఆగని వరద ప్రవాహం..
కాంక్రీట్ ప్రపంచం ఇప్పుడు పల్లెలను అందుకుంది. ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అవసరాలకు సరిపడా వాగులు, వంకల నుంచి ఇసుకను తోడకుండా ఇష్టారీతిగా ఇసుకను తోడేస్తుండటంతో వాగులకు ఉన్న సహజ స్వభావం కనుమరుగు కావాల్సి వస్తోంది. వాగుల్లో ఇసుక ఉంటే వరద నీరు వేగం తగ్గించడంతోపాటు వచ్చిన వరదను భూగర్భంలోకి పంపేందుకు ఇసుక తోడ్పాటునందిస్తుంది. ప్రస్తుతం ధనార్జనే ధ్యేయంగా ఇసుక మాఫియాలు వాగులు, వంకల్లో ఇసుకను ఇష్టం వచ్చినట్టు తోడేయడంతో వరద నీరు వేగంగా నదుల్లోకి చేరుతుంది. ఏది ఏమైనప్పటికీ మానవుడు సౌకర్యాలు, విలాసాల కోసం చేస్తున్న పాకులాట ఇప్పుడు ప్రకృతి ఉగ్రరూపానికి కారణమవుతున్నాయి.
గోదావరి వరదలు నేర్పిన పాఠాల నుంచి ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటే భవిష్యత్ తరాల మనుగడకు ముప్పలేకుండా చేయవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కడికక్కడ నీటి నిల్వ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల నీటిని నదుల్లోకి చేరక ముందే కంట్రోల్ చేయవచ్చని... ఒక్కసారికి నదుల్లోకి నీరు చేరితే కంట్రోల్ చాలా కష్టమవుతుందని అంటున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు లేకుండా చూడాలని చెబుతున్నారు. చెట్ల నరికివేత కూడా ఈ అకస్మాత్ వరదలకు కారణంగా అభిప్రాయపడుతున్నారు నిపుణులు.