ఐటీఐ కోర్స్‌లు చేయాలంటే ఎలా..?


టెన్త్ తరవాత చేయదగ్గ కోర్సుల్లో కీలకమైంది ఐటీఐ. తక్కువ వ్యవధిలో నైపుణ్యాలు సాధించి, తొందరగా స్థిరపడాలనుకునే వాళ్లు ఐటీఐ కోర్స్‌ని ఎంచుకోవచ్చు. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో నిపుణుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించి పెట్టిందే ఈ ఐటీఐ కోర్స్. పదో తరగతి చదివిన వాళ్లెవరైనా ఇందులో చేరేందుకు అర్హులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఐటీఐలో చేరిపోవచ్చు. పదోతరగతిలో సాధించిన మార్క్‌ల ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఐటీఐలోని కోర్స్‌లనే ట్రేడ్‌లుగా పిలుస్తారు. ఐటీఐ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా 130కిపై కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. 


ఏయే కోర్స్‌లు ఉంటాయి..? 


కేంద్రం పరిధిలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌-ITIలు. ఎంచుకునే కోర్స్ ఆధారంగా వ్యవధి ఏడాది లేదా రెండేళ్లుగా ఉంటుంది. ఇంజనీరింగ్‌తోపాటు నాన్ ఇంజనీరింగ్ విభాగంలోనూ ఐటీఐ కోర్స్ చేసేందుకు వీలుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 వరకూ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి మేరకు ఏడాది లేదా రెండేళ్ల కోర్స్‌లను ఎంపిక చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, వెల్డర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్ తదితర కోర్స్‌ల వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, కెమికల్ ప్లాంట్‌లో ఆపరేటర్ తరహా కోర్స్‌ల వ్యవధి రెండేళ్లు ఉంటుంది. 


స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌తో అవకాశాలు..


ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ని పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. ఉన్నత చదువులు చదవాలనుకునే వారు డిప్లొమా కోర్స్‌లో చేరవచ్చు. లేటరల్ ఎంట్రీతో కొన్ని బ్రాంచ్‌లలో డిప్లొమా సెకండ్ ఇయర్‌లో జాయిన్ అవచ్చు. డిప్లొమా తరవాత కూడా ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ కోర్స్‌లో నేరుగా సెకండ్ ఇయర్‌లో చేరొచ్చు. ఐఐటీ కోర్స్‌ పూర్తి చేసిన వాళ్లు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో శిక్షణ తీసుకోవచ్చు. అప్రెంటిస్‌ చేసిన వాళ్లకు పలు సంస్థల్లో ప్రాధాన్యత ఉంటుంది. నవరత్న, మహారత్న లాంటి సంస్థల్లో ఐటీఐ చేసిన వారికి అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నారు. రైల్వేలోనూ అప్రెంటిస్‌లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇక స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ వల్ల ఐటీఐ చేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పరిశ్రమలు, తయారీ సంస్థలు, రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐటీఐ చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 


రూ.10 వేల లోపు ఫీజుతోనే ఐటీఐ..


విద్యుత్ రంగంలో లైన్‌మెన్‌ జాబ్‌లకు వీళ్లు అర్హులు. ఎలక్ట్రికల్ కోర్స్ చేసిన వాళ్లు జూనియర్ లైన్‌మెన్‌ పోస్ట్‌లకు అప్లై చేసుకోవచ్చు. స్టీల్‌ప్లాంట్‌లు, పోర్ట్‌ల్లోనూ ఐటీఐ చేసి వారికి డిమాండ్ ఉంది. ఇదే కాకుండా స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. నగరాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ తదితర పనులు చేసే వారికి బాగానే డిమాండ్ ఉంటోంది. ఐటీఐ కోర్స్‌తో నైపుణ్యాలు సాధించిన వారు ఇలా సొంతగానూ పనులు చేసుకుంటూ చేతి నిండా సంపాదించుకోవచ్చు. కొన్ని సంస్థలు సర్టిఫికెట్‌లు అందించి ఐటీఐ చేసిన వాళ్లను అవసరాల ఆధారంగా విదేశాలకూ పంపుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐటీఐ కోర్స్‌కి ఫీజ్‌ రూ. 1000 నుంచి రూ. 9,000 కాగా, నాన్ ఇంజనీరింగ్‌ విభాగంలో ఇది రూ. 7 వేల వరకూ ఉంటుంది. 


Also Read: Diploma Course after 10th: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్‌ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?


Also Read: Optical Illusion: ఆ ఆలయం గోడలపై 900 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూషన్ , ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది