టెన్త్ తరవాత డిప్లొమా బెటర్ ఆప్షనేనా..? 


పదో తరగతి ఫలితాలొచ్చేశాయ్. ఇక నెక్స్ట్ ఏంటి..? అన్న డౌట్ చాలా మందికే ఉంటుంది. అదేంటి..? ఇంటర్మీయట్‌ చదవటమేగా..? అంతకు మించి ఇంకేముంటుంది..? అని అంటారా..? టెన్త్ తరవాత ఇంటర్ మాత్రమే కాదు. ఇంకా ఎన్నో కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వేటికవే ప్రత్యేకం. కాస్త మనసు పెట్టి ఆలోచించి, ఏ వైపు వెళ్లాలో డిసైడ్ అవచ్చు. మరి టెన్త్ తరవాత ఇంటర్ కాకుండా ఎలాంటి కోర్స్‌లున్నాయో చూద్దామా..? 


డిప్లొమా చేయాలంటే ఎలా..? 


ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది డిప్లొమా కోర్సుల గురించే. మూడు నాలుగు కాదు. ఏకంగా పాతికకుపైగా డిప్లొమా కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టాప్‌లో ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ కోర్స్‌ వ్యవధి మూడేళ్లు. పదో తరగతి తరవాత ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారికి పాలిటెక్నిక్ కాలేజీలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందుకోసం పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో పదో తరగతికి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్‌లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎయిడెడ్, ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ మూడేళ్ల డిప్లొమా కోర్స్‌ను అందిస్తున్నాయి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లో పట్టు ఉన్న వాళ్లు ఈ కోర్స్‌ను చేయచ్చు. కాస్త తొందరగా సెటిల్‌ అయిపోవాలనుకునే వారికీ డిప్లొమా కోర్స్‌ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు.


డిప్లొమాలో ఎన్ని కోర్సులున్నాయి..? 


డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌తో పాటు మరో పాతిక కోర్స్‌లు ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి కోర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. పాలిసెట్‌లో అర్హత సాధించిన వారికి రెండు ర్యాంకులు కేటాయిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్‌ లేదా నాన్‌ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో గానీ చేరేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం హోటల్ మేనేజ్‌మెంట్‌కి మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేయవచ్చు. అది కాకుండా ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, కంప్యూటర్, ఐటీ, కెమికల్, సెరామిక్, ఫుట్‌వేర్..  ఇలా ఎన్నో బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని కోర్సుల వ్యవధి మూడన్నరేళ్లుగా ఉంటుంది. అగ్రికల్చర్‌ విభాగంలోనూ డిప్లొమా కోర్స్‌లకు మంచి డిమాండే ఉంది. 


ఉపాధి అవకాశాలు


డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ జర్నలిజం, డిప్లొమా ఇన్ సైకాలజీ, డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ, ఫైన్ ఆర్ట్స్ లాంటి కోర్సులనూ చేయవచ్చు. డిప్లొమా చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగానే ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశముంటుంది. రైల్వేలోనూ చాలా మంది డిప్లొమా అర్హతతోనే జూనియర్ ఇంజనీర్ జాబ్స్ దక్కించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని మరికొన్ని సంస్థల్లో జేఈ కొలువులు సంపాదించేందుకు ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో డిప్లొమా చేసిన వాళ్లకీ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయి, సెలెక్ట్ అయిన వారికి లెవల్స్ ఆధారంగా జీతాలు ఇస్తారు. మొదట్లో రూ. 34వేలు సాలరీ అందిస్తారు. 


అటు ప్రైవేట్ రంగంలోనూ డిప్లొమా చేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఆటోమొబైల్, నిర్మాణ రంగం, పవర్‌ ప్లాంట్లు తదితర సంస్థల్లో జాబ్‌లు పొందేందుకు అవకాశముంటుంది. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తైన తరవాత నచ్చిన ఉద్యోగంలో చేరచ్చు. హైయర్ఎ డ్యుకేషన్ వైపు వెళ్లాలంటే మాత్రం "ఈసెట్‌" రాసి బీటెక్‌ కోర్సులో లేటరల్‌ ఎంట్రీ పొందవచ్చు.